Telugu Global
Telangana

తెలంగాణలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్

మూడింటికి ఎన్ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. ఇక మిగిలిన ఆరు కాలేజీలకు సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది.

తెలంగాణలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్
X

తెలంగాణలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పచ్చ జెండా ఊపింది. జనగామ, కామారెడ్డి, వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చింది. దీంతో ఒక్కో కాలేజీలో వంద చొప్పున మూడొందల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది. వీటిలో మూడింటికి ఎన్ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది.

ఇక మిగిలిన ఆరు కాలేజీలకు సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. వాటికి కూడా త్వరలోనే అనుమతులు వస్తాయని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అనుమతి వచ్చిన మూడు వైద్య కళాశాల్లో ఎన్ఎంసీ నిబంధనల మేరకు బోధనా సిబ్బందిని నియమించడంతో పాటు, మౌళిక వసతులను కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలను ఒకే రోజు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత దశలో ప్రకటించిన సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటకి సంబంధించిన పరిపాలనా అనుమతులను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా ఏర్పాటు చేయనున్న కాలేజీల కోసం అదనంగా 313 పోస్టులను మంజూరు చేసింది.

రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న 9 కాలేజీలకు గాను మూడింటికి ఇప్పటికే అనుమతులు వచ్చాయి. మిగిలిన వాటకి కూడా త్వరితగతిన అనుమతులు తెచ్చుకొని జులై నాటికి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.

కొత్త కాలేజీల పనుల పురోగతిపై ఆయా జిల్లాల మంత్రులు సత్యవతిరాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి సమీక్షించారు. జూలై నాటికి తరగతులు ప్రారంభించేందుకు అన్ని వసతులు కల్పించాలని, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

First Published:  5 April 2023 6:31 AM GMT
Next Story