Telugu Global
Telangana

నిజామాబాద్ లో అయినా నిజాలు చెబుతారా..?

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌ లో బీదర్‌ నుంచి బయలుదేరుతారు ప్రధాని మోదీ. 2.55 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటారు. గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే సభకు హాజరవుతారు.

నిజామాబాద్ లో అయినా నిజాలు చెబుతారా..?
X

ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు పర్యటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగిన వేళ, ఈరోజు ఆయన నిజామాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఇక్కడ కూడా అబద్ధాలు చెబుతారా, లేక నిజాలేమైనా మాట్లాడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గిరిజన వర్శిటీ, పసుపు బోర్డ్ అంటూ పాలమూరులో కల్లబొల్లి మాటలు చెప్పిన మోదీవి ఎన్నికల వేళ, అవకాశవాద రాజకీయాలంటూ మండిపడుతున్నారు.

నిజామాబాద్ పర్యటన ఇలా..

మోదీ నిజామాబాద్ పర్యటన మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంతోపాటు, పార్టీ కార్యక్రమం కూడా జరుగుతుంది. రెండిటికీ వేర్వేరుగా వేదికలు సిద్ధం చేశారు. అయితే ఆ రెండు వేదికలు నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ లోనే ఏర్పాటు చేయడం విశేషం.

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌ లో బీదర్‌ నుంచి బయలుదేరుతారు ప్రధాని మోదీ. 2.55 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటారు. గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే సభకు హాజరవుతారు. వర్చువల్‌ పద్ధతిలో రామగుండంలోని ఎన్టీపీసీ 800 మెగావాట్స్‌ పవర్‌ ప్లాంట్‌ ను ప్రారంభిస్తారు. పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. గంటసేపు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయాలకోసం మరో వేదిక ఎక్కుతారు మోదీ.

సాయంత్రం 4 గంటలకు బీజేపీ సభకు షెడ్యూల్ ఖరారైంది. అదే మైదానంలో కాస్త పక్కగా ఈ సభా వేదికను సిద్ధం చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులంతా ఈ సభకు హాజరవుతారు. పాలమూరు సభకు కొందరు సీనియర్లు మొహం చాటేయగా.. వారిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం ఈ సభలో అయినా వారు కనపడితే.. పార్టీ మార్పు వార్తలను ఖండించినట్టు అనుకోవాలి. రెండో సభకు కూడా నేతలు డుమ్మాకొడితే మాత్రం బీజేపీలో ఏదో జరుగుతోందనే వాదన కొట్టిపారేయలేం.

First Published:  3 Oct 2023 1:59 AM GMT
Next Story