Telugu Global
Telangana

తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరుపై నిర్మలా సీతారామన్ మాటల్లో నిజమెంత?

మెడికల్ కాలేజీల కోసం స్థలాల జాబితాను కేంద్రం అడిగినప్పుడు, రాష్ట్రం కరీంనగర్, ఖమ్మంలను సూచించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఆమె చెప్పారు. మరో వైపు ఇతర కేంద్ర మంత్రులు గతంలో అందుకు విరుద్దంగా మాట్లాడారు.

తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరుపై నిర్మలా సీతారామన్ మాటల్లో నిజమెంత?
X

తెలంగాణకు కేంద్రం కేటాయింపుల విషయంలో, ప్రత్యేకించి రాష్ట్రానికి మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో వాస్తవాలను వక్రీకరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కేంద్రమంత్రులకు అలవాటుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసినా ఒక్క మెడికల్ కాలేజీని కూడా రాష్ట్రానికి మంజూరు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం, బీఆరెస్ పార్టీల విమర్శలకు జవాబుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం చెప్పిన మాట‌లు పూర్తిగా వక్రీకరణలతో కూడుకున్నవని బీఆరెస్ నాయకులు అంటున్నారు.

మెడికల్ కాలేజీల కోసం స్థలాల జాబితాను కేంద్రం అడిగినప్పుడు, రాష్ట్రం కరీంనగర్, ఖమ్మంలను సూచించిందని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఆమె చెప్పారు. మరో వైపు ఇతర కేంద్ర మంత్రులు గతంలో అందుకు విరుద్దంగా మాట్లాడారు.

గత ఏడాది మార్చిలో, లోక్‌సభలో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తెలంగాణాలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం కేంద్రానికి ఎటువంటి ప్రతిపాదన రాలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ చెప్పారు. డిసెంబర్ 2021లో కూడా, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్ర పథకం కింద వైద్య కళాశాలల కోసం తెలంగాణ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదని డాక్టర్ ప్రవీణ్ పవార్ చెప్పారు.

వాస్తవం ఏమిటంటే, 2019లో, అప్పటి ఆరోగ్య మంత్రి సి లక్ష్మా రెడ్డి డాక్టర్ హర్షవర్ధన్‌కు పదేపదే లేఖలు రాస్తూ, జిల్లా ఆసుపత్రులను, ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మంలోని ఆస్పత్రులను సిఎస్‌ఎస్ కింద మెడికల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. CSS 1, 2 వ దశలలో తెలంగాణను కవర్ చేయడం సాధ్యం కాదని, దానిని 3వ దశలో పరిశీలిస్తామని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అయితే, CSS పథకం 3వ దశ ఆగష్టు 2019లో ఆమోదించబడింది. కానీ మూడేళ్ల తర్వాత కూడా హర్షవర్ధన్ హామీ కాగితాలపైనే మిగిలిపోయింది.

రెండు నెలల క్రితం, డిసెంబర్‌లో, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని కేంద్రం కోరుకుంటుందని అన్నారు.

2021 జూలైలో కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌లో, మోడీ ప్రభుత్వం మూడేళ్లలో దేశంలో 90 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని, వాటిలో తొమ్మిది తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. నిజానికి కేంద్రం ఏర్పాటు చేసింది ఒక్కటి మాత్రమే. అది AIIMS బీబీనగర్. ఆయన చెప్పిన వాటిలో ఐదు ప్రైవేట్ కాలేజీలు. మూడు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసినవి.

First Published:  17 Feb 2023 1:31 AM GMT
Next Story