Telugu Global
Telangana

నిర్మలమ్మ ప్రచారం.. బీఆర్ఎస్ కి అనుకోని వరం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం మిస్ ఫైర్ అయింది. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.

నిర్మలమ్మ ప్రచారం.. బీఆర్ఎస్ కి అనుకోని వరం
X

ఇటీవల కర్నాటక కాంగ్రెస్ నేతలు తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంతో కాంగ్రెస్ కి మేలు జరగకపోగా, వారి మాటలు అధికార బీఆర్ఎస్ కి అనుకోని వరంలా మారాయి. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 గంటల కరెంటు ఇవ్వడానికే ఆపసోపాలు పడుతోంది, అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24గంటల కరెంటు ఇస్తోందనే విషయం ప్రజలకు మరోసారి స్పష్టంగా తెలిసొచ్చింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం కూడా ఇలాగే మిస్ ఫైర్ అయింది. మోటార్ల‌కు మీటర్లు పెట్టని కారణంగా తెలంగాణ పాతిక వేల కోట్ల రూపాయల సాయాన్ని కోల్పోయిందని చెప్పారామె. అంటే ఆ పాతిక వేల కోట్లను కేంద్రం తెలంగాణకు ఎగ్గొట్టిందనే విషయాన్ని ఆమె ఒప్పుకున్నట్టయింది. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.

నిర్మలమ్మ స్టేట్ మెంట్ కు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో కౌంటర్ ఇచ్చారు. పాతిక వేల కోట్ల రూపాయల సాయం కావాలంటే తెలంగాణలో మోటార్ల‌కు మీటర్లు పెట్టాలని కేంద్రం కండిషన్ పెట్టిందని, కానీ తన తల తెగిపడినా ఆ పని చేయబోనని చెప్పానని, ఫలితంగా కేంద్రం తెలంగాణపై కక్ష సాధిస్తోందని.. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర మంత్రి కూడా ఒప్పుకున్నారని చెప్పారు కేసీఆర్. నిర్మలా సీతారామన్ స్టేట్ మెంట్ తోనే బీజేపీని టార్గెట్ చేశారు.

మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేశారు. దుబ్బాక రోడ్ షో లో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. మోటార్ల‌కు మీటర్లు పెట్టని కారణంగా తెలంగాణకు పాతిక వేల కోట్ల రూపాయలు నిలిపివేసిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. దుబ్బాక ప్రజలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వాలన్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు కూడా నిర్మలమ్మను టార్గెట్ చేశారు. పంట పొలాల్లో మోటార్ల‌కు మీటర్లు పెట్టాలని కేంద్రం, తెలంగాణ సర్కార్‌ ని ఒత్తిడి చేసిందని.. మీటర్లు పెట్టలేదని తెలంగాణకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలా సీతారామన్‌ బయటపెట్టారని అన్నారాయన. కాంగ్రెస్‌, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలని విమర్శించారు. ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మోటార్ల‌కు మీటర్లు పెట్టారని, రాజస్థాన్‌ లో కూడా రైతుల మోటార్ల‌కు మీటర్లు బిగించారని చెప్పారు హరీష్ రావు. ఆ రెండు పార్టీల్లో దేనికి ఓటు వేసినా, రైతులు మోటార్ల‌కు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నట్టవుతుందని అన్నారు.


First Published:  22 Nov 2023 6:49 AM GMT
Next Story