Telugu Global
Telangana

నిమ్స్ డైరెక్టర్ కు గుండెపోటు... అపోలోలో చికిత్స‌

కార్పోరేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో వైద్యం అందించే వైద్య నిపుణులు, పరికరాలు ఉన్న ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్ కు గుండె పోటు వస్తే చికిత్స కోసం ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇది నిమ్స్ ఆస్పత్రిపై రోగుల్లో అపనమ్మకాన్ని కలగజేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

నిమ్స్ డైరెక్టర్ కు గుండెపోటు... అపోలోలో చికిత్స‌
X

హైదరాబాద్ లోనే ప్రముఖ ఆస్పత్రి, అనేక మంది స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులున్న, అద్భుతమైన వైద్యానికి పేరెన్నిక గల నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ కే.మనోహర్ కు గుండె పోటు వచ్చింది. దాంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు.

కార్పోరేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో వైద్యం అందించే వైద్య నిపుణులు, పరికరాలు ఉన్న ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రికి అధిపతిగా ఉండి... తాను మాత్రం కార్పోరేట్ ఆస్పత్రిలోచేరడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.

గుండె జబ్బులతో, గుండె పోటు వచ్చి రోజుకు అనేక మంది నిమ్స్ లో చేరుతుంటారు. అలాంటి నిమ్స్ డైరెక్టర్ వెళ్ళి అపోలో ఆస్పత్రిలో చేరడమేంటని ప్రశ్న‌లు వస్తున్నాయి.ఇది తన నాయకత్వం వహిస్తున్న ఆస్పత్రి మీదనే అపనమ్మకాన్ని కలిగించదా అనే విమర్శలు వస్తున్నాయి.

దీనిపై నిమ్స్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు మాదివాడ రామబ్రహ్మం ఓ ప్రకటన విడుదల చేశారు.

నిమ్స్ డైరెక్టర్ అపోలోలో చేరిన వార్త విని షాక్ కు గురయ్యానని, ''ముందు నమ్మకం కుదరలేదు. తర్వాత తెలుసుకుంటే నిజమని తెలిసింది'' అన్నారాయన.

ఇది ఒక్క కార్డియాలజీ డిపార్ట్మెంట్ కే కాదు... మొత్తం నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్టకు జరిగిన తీవ్ర అవమానం అని రామబ్రహ్మం మండి పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో తన నివాసానికి సమీపంలో ఉన్న కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లి సేవలు పొందడం తప్పు కాదు కానీ, ఆ తర్వాత కూడా పూర్తి వైద్య సేవలు అదే కార్పోరేట్ ఆసుపత్రిలో పొందాలని నిర్ణయం తీసుకోవడం మాత్రం కచ్చితంగా... తను అధిపతిగా పనిచేస్తున్న నిమ్స్ ఆస్పత్రిని దారుణంగా అవమానపరచడమే అని, రేపు అపోలోలో చెల్లించిన బిల్లులు మొత్తం నిమ్స్ నుంచి రీయింబర్స్‌మెంట్‌ చేయించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఆయన అన్నారు.

ప్రభుత్వం జోక్యం చేసుకొని, అతన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని రామబ్రహ్మం డిమాండ్ చేశారు.

First Published:  7 Sep 2022 7:45 AM GMT
Next Story