Telugu Global
Telangana

వైద్య సేవల్లో నిమ్స్ మరో రికార్డు.. 8 నెలల్లో 100 ఉచిత కిడ్నీ మార్పిడి సర్జరీలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1000 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసిన నిమ్స్ వైద్యులు.. గడిచిన 8 నెలల్లో 100 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు నిర్వహించారు.

వైద్య సేవల్లో నిమ్స్ మరో రికార్డు.. 8 నెలల్లో 100 ఉచిత కిడ్నీ మార్పిడి సర్జరీలు
X

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవల్లో పోటీ పడుతోంది. సామాన్యులకు కూడా ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఇన్నాళ్లూ కిడ్నీ మార్పిడి చికిత్సలు అంటే కేవలం కార్పొరేట్ ఆసుపత్రులే గుర్తుకు వచ్చేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాల వల్ల నిమ్స్ కూడా ఆధునిక శస్త్ర చికిత్సలు వేగంగా చేస్తోంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,000 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసిన నిమ్స్ వైద్యులు.. గడిచిన 8 నెలల్లో 100 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు నిర్వహించారు. దేశంలోని ఏ ప్రభుత్వ రంగ ఆసుపత్రి కూడా ఇంత వేగంగా.. ఇన్ని ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలు చేయలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయల విలువ చేసే ఈ చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం, సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఉచితంగానే అందించినట్లు నిమ్స్ యూరాలజీ అధికపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. నిమ్స్ నిర్వహించిన 100 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీల్లో రెండు పిడియాట్రిక్ సర్జరీలు ఉన్నాయని దేవరాజ్ వివరించారు.

నిమ్స్ చరిత్రలో 1,600 సర్జరీలు నిర్వహించగా.. తెలంగాణ ఏర్పడిన తర్వాతే 1,000 సర్జరీలు చేశామని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన 100 సర్జరీల్లో 61 శస్త్ర చికిత్సలకు కిడ్నీలు లివింగ్ డోనర్ల ద్వారా సేకరించినవి కాగా.. 39 సర్జరీలను మాత్రం బ్రెయిన్ డెడ్ డోనర్ల ద్వారా తీసుకున్నవిగా నిమ్స్ వైద్యులు తెలిపారు. కిడ్నీ గ్రహీతలు, దాతలు అందరూ ప్రస్తుతం కోలుకున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ ఇటీవలే నిమ్స్‌కు రోబోటిక్ సేవల కోసం రూ.32 కోట్లతో పరికరాలు కొనుగోలు చేసింది. ఆ ఆధునిక పరికరాలు ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలో 30 రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసినట్లు వైద్యులు చెప్పారు. కాలేయం, మూత్ర పిండాలు, పెద్దపేగు, అన్నవాహిక, మూత్రాశయం, గర్భాశయ ముఖ ద్వార తదితర క్యాన్సర్లకు ఈ రోబోటిక్ పరికరం ద్వారా చికిత్సలు చేసినట్లు పేర్కొన్నారు.

నిమ్స్ ఆసుపత్రిలో నిత్యం 100 యంత్రాల ద్వారా డయాలసిస్ చేస్తున్నామని.. నిత్యం 400 మంది రోగులు ఈ సేవలను వినియోగించుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. నిమ్స్‌లో డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో అత్యధికంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సేవలు పొందుతున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు.

First Published:  9 Sep 2023 2:38 AM GMT
Next Story