Telugu Global
Telangana

బీసీ సీఎం.. బీజేపీలోనే ఎందుకంత భయం..?

బీజేపీ అధికారంలోకి వస్తే తాను సీఎం అవుతానని చెప్పనని, తనకు ఆ అలవాటు లేదని అన్నారు బండి సంజయ్. ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారన్నారు.

బీసీ సీఎం.. బీజేపీలోనే ఎందుకంత భయం..?
X

తెలంగాణలో బీఆర్ఎస్ నేతలయినా, కార్యకర్తలయినా తమ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆరేనని చెబుతారు. కాంగ్రెస్ లో మాత్రం ఎవర్ని కదిలించినా తానే సీఎం అభ్యర్థి అని చెప్పుకుంటారు. బీజేపీలో మరీ విచిత్ర పరిస్థితి ఉంది, మీ సీఎం అభ్యర్థి ఎవరంటే.. మేమైతే కాదు అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. తాజాగా బీసీ సీఎం అనే ప్రస్తావన వచ్చినప్పటినుంచి బీసీ నాయకులు మరింత అలర్ట్ అయ్యారు. సీఎం అనే మాట వినపడితే చాలు చెవులు మూసుకుంటున్నారు, తమకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నేరుగా ప్రశ్నలు ఎదురైనా తాము రేస్ లో ఉన్నామని చెప్పుకోడానికి కూడా వారు వెనకాడుతున్నారు. తాజాగా బండి సంజయ్ బీసీ సీఎం వ్యవహారంపై స్పందించారు. తాను సీఎం అవుతానని ఏనాడూ చెప్పలేదని అన్నారు బండి.

బీజేపీ అధికారంలోకి వస్తే తాను సీఎం అవుతానని చెప్పనని, తనకు ఆ అలవాటు లేదని అన్నారు బండి సంజయ్. ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని, తాను సీఎం అవుతానని ఎప్పుడూ చెప్పలేదని, చెప్పబోనని స్పష్టం చేసారు. సామాన్య కార్యకర్తనైన తనకు ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులిచ్చి పార్టీ గౌరవించిందన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయమే తనకు శిరోధార్యం అని చెబుతున్నారే కానీ, బీసీ నాయకుడినైన తాను సీఎం రేసులో ఉన్నానని మాత్రం బండి చెప్పడంలేదు.

కాంగ్రెస్ అలా, బీజేపీ ఇలా..

కాంగ్రెస్ లో మాత్రం తానే సీఎం అని చెప్పుకుంటున్నారంతా. కానీ బీజేపీలో సీన్ రివర్స్. బీసీ సీఎం అని అధిష్టానం ప్రకటించినా.. కనీసం బీసీ నాయకులు కూడా తాము సీఎం రేసులో ఉన్నామని చెప్పుకోవడంలేదు. పొరపాటున ఆ మాట అన్నా కూడా అది హాస్యాస్పదంగా ఉంటుందనే విషయం వారికి కూడా తెలుసు. తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లెన్ని..? వారికి వచ్చే ఓట్లెన్ని..? సీఎం కుర్చీపై ఆ పార్టీ చేస్తున్న ప్రకటనలేంటి..? అంటూ సోషల్ మీడియాలో ఈపాటికే సెటైర్లు పేలుతున్నాయి. ఈ దశలో సీఎం రేసులో ఉన్నామని చెబితే అది మరింత అతిగా ఉంటుందనే కారణంతోనే బీసీ నాయకులు కూడా అందుకు దూరంగా ఉంటున్నారు. బండి మాటల్లోని పరమార్థం అదే.

First Published:  12 Nov 2023 2:23 AM GMT
Next Story