Telugu Global
Telangana

అక్టోబర్ 30 వరకు ఓటు నమోదుకు అవకాశం

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఓట్ల నమోదు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత చేసి ఓటు నమోదు చేసుకోవచ్చు.

అక్టోబర్ 30 వరకు ఓటు నమోదుకు అవకాశం
X

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. తుది ఓటర్ల జాబితాను కూడా ఈ నెల 4నే ప్రచురించారు. దీంతో ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు నిరాశ చెందారు. అయితే ఓటు హక్కు లేని వారు ఎలాంటి అసంతృప్తి చెందవద్దని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నెల 30 వరకు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఓట్ల నమోదు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత చేసి ఓటు నమోదు చేసుకోవచ్చు. కేవలం వారం రోజుల్లోనే ఈ దరఖాస్తులు పరిశీలించి ఓటు హక్కును కల్పించనున్నారు. ఇక మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళల కోసం ప్రతీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే నియోజకవర్గానికి ఐదు చొప్పున ఆదర్శ కేంద్రాలను కూడా సిద్ధం చేయనున్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, సైన్యంలో ఉన్న వారిని సర్వీస్ ఓటర్లుగా పరిగణిస్తారు. వీరికి మాత్రమే గతంలో పోస్టల్ బ్యాలెట్‌లు ఇచ్చేవారు. అయితే ఈ సారి మూడు కేటగిరీల్లో సర్వీస్ ఓటర్లను గుర్తిస్తున్నారు. సైన్యంలో ఉండేవారు ఒక కేటగిరీ, ఎన్నికల విధుల్లో ఉండేవారు రెండో కేటగిరీగా నమోదు చేయనున్నారు. ఇక కొత్తగా మూడో కేటగిరీని కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు వయోధికులు, దివ్యాంగులు, అత్యవసర సేవల్లో ఉండే వారిని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇలాంటి వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించనున్నారు.

First Published:  18 Oct 2023 1:49 AM GMT
Next Story