Telugu Global
Telangana

కేసీఆర్‌కు కొత్త తిప్పలు.. తెలంగాణలో ఎంఐఎం విస్తరణకు ప్రణాళిక

వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పోటీ చేయాలని ఎంఐఎం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బోధన్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, భైంసా నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు బాగానే ఉన్నారు.

కేసీఆర్‌కు కొత్త తిప్పలు.. తెలంగాణలో ఎంఐఎం విస్తరణకు ప్రణాళిక
X

సీఎం కేసీఆర్ మిత్రుడు అసదుద్దీన్ ఒవైసీ ఝలక్ ఇవ్వబోతున్నారా? ఇన్నాళ్లూ కేవలం హైదరాబాద్‌కే పరిమితం అయిన పార్టీని తెలంగాణలో విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏఐఎంఐఎం పార్టీ ముస్లింల పార్టీగా చెలామణి అవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని పాత నగరంలో బలమైన పార్టీగా ఉన్న ఎంఐఎం.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ప్రాంతాల్లో కూడా పోటీ చేసింది. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఔరంగాబాద్ ఎమ్మెల్యేగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఔరంగాబాద్ లోక్‌సభ ఎంపీగా ఇంతియాజ్ జలీల్ ఎంఐఎం నుంచి గెలుపొంది రికార్డు సృష్టించారు. అంతే కాకుండా ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పలువురు కార్పొరేట్లు ఎంఐఎం నుంచి గెలుపొందారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సత్తా చాటింది.

పార్టీ పుట్టిన తెలంగాణలో మాత్రం కేవలం హైదరాబాద్‌కే పరిమితం అయ్యింది. వైఎస్ఆర్ హయాంలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌తో దోస్తీ కట్టింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌కు దగ్గరైంది. తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎంకు చెప్పుకోదగిన సీట్లే ఉన్నాయి. అయితే ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తున్నా.. తెలంగాణలో మాత్రం కేవలం పాత నగరానికే పరిమితం అయ్యింది. కాగా, ఈ సారి తమ పార్టీని తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఒవైసీ బ్రదర్స్ నిర్ణయించినట్లు దారుస్సలాం వర్గాలు చెబుతున్నాయి. యూపీ, బీహార్, గుజరాత్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్న దగ్గర పోటీ చేసి ఎంఐఎం చెప్పుకోదగిన విజయాలే సాధించింది. ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుతూ.. క్రమంగా తమ ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. అదే పంథాలో తెలంగాణలో ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పోటీ చేయాలని ఎంఐఎం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బోధన్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, భైంసా నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు బాగానే ఉన్నారు. వీళ్లు ఇన్నాళ్లూ కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్‌కు ఓట్లు వేస్తూ వచ్చారు. ఇటీవల ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోంది. దీంతో ఎంఐఎంను బరిలోకి దించి.. ముస్లింలకు భరోసా కల్పించాలని ఒవైసీ బ్రదర్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఉన్న స్థానిక నేతలకు సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్లలో ఎంఎంఐ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్కడ ఆశించిన ఫలితాలు వస్తే భవిష్యత్‌లో ఉత్తర తెలంగాణతో విస్తరించాలని వ్యూహం రచిస్తున్నారు.

అవసరం అయితే కేసీఆర్‌తో చర్చించి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని కూడా అసదుద్దీన్ ఒవైసీ అనుకుంటున్నారు. పొత్తులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలను కేటాయించమని కోరే అవకాశం ఉన్నది. ఇప్పటికే నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటింది. అక్కడ టీఆర్ఎస్ 13 డివిజన్లు గెలిస్తే.. ఎంఐఎం ఏకంగా 16 డివిజన్లలో గెలవడం గమనార్హం. బోధన్ మున్సిపాలిటీలో కూడా ఎంఐఎం 11 మంది వార్డు మెంబర్లను గెలుచుకుంది. కాబట్టే అక్కడ తప్పకుండా ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోవచ్చని భావిస్తున్నది.

కేసీఆర్ ఇప్పటికే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో పాటు హైదరాబాద్ పరిధిలో వాళ్లు సీట్లు కోరుతున్నారు. దీంతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు ఆశావహులు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. దీంతో వామపక్షాలకు టికెట్లు కేటాయించడం కేసీఆర్‌కు కత్తిమీద సామే. ఇప్పుడు ఎంఎంఐ కూడా పొత్తుకు వచ్చి టికెట్లు అడిగితే కేసీఆర్‌కు కొత్త తిప్పలు మొదలైనట్లే. బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తమ స్థానాలను కోల్పోవలసి వస్తుంది. వీరిద్దరూ కేసీఆర్‌కు సన్నిహితులే. ఇప్పటికే రెండు సార్లు వారిద్దరూ ఆయా స్థానాల నుంచి గెలిచారు. సిట్టింగ్ సీట్లను వదిలేసి మిత్రులకు కేసీఆర్ టికెట్లు ఇస్తారా? లేదంటే విడిగా పోటీ చేయమని సలహా ఇస్తారా అనే సందిగ్ధ‌త నెలకొన్నది. ప్రస్తుతానికైనే ప్రతిపాదనల దశలోనే ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కాకుండా మిగిలిన ప్రాంతాల్లో పోటీకి మాత్రం ఎంఐఎం ఆసక్తి చూపిస్తోంది.

మరోవైపు నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలో కొన్ని చోట్లు ఎంఐఎం మద్దతు ఇవ్వడం వల్లనే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారనే వాదన ఉన్నది. ఇప్పుడు విడిగా పోటీ చేస్తే రెండు పార్టీలు నష్టపోతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇద్దరూ కలసి పోటీ చేయడానికే మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  22 Sep 2022 1:41 AM GMT
Next Story