Telugu Global
Telangana

ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ కేసులో కొత్త కోణం.. - నిందితురాలు రేణుక త‌మ్ముడికి ఏఈ ప‌రీక్ష రాసే అర్హ‌తే లేదు

రూ.10 ల‌క్ష‌ల‌కు బేరం కుదుర్చుకుంది. నిజానికి రాజేశ్వ‌ర్‌కు ఏఈ ప‌రీక్ష రాసేందుకు అర్హ‌త కూడా లేదు. అత‌ను టీటీసీ చ‌దివాడు. కాంట్రాక్టు ప‌నులు చేస్తున్నాడు.

ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ కేసులో కొత్త కోణం.. - నిందితురాలు రేణుక త‌మ్ముడికి ఏఈ ప‌రీక్ష రాసే అర్హ‌తే లేదు
X

టీఎస్‌పీఎస్‌సీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో స‌రికొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంలో నిందితురాలు రేణుక ప‌క్కా వ్యూహ ర‌చ‌నతోనే ప్ర‌శ్న‌ప‌త్రాల కోసం ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలిసింది. ఈ కేసును బేగంబ‌జార్ పోలీస్‌స్టేష‌న్ నుంచి సీసీఎస్ కు బుధ‌వారం బ‌దిలీ చేశారు. సిట్ అధిప‌తి ఏఆర్ శ్రీ‌నివాస్ ఈ కేసు విచార‌ణ వేగవంతం చేశారు.

ఈ కేసులో నిందితురాలు రేణుక ప్ర‌శ్న‌ప‌త్రాల కోసం పెద్ద ప్లాన్‌తోనే రంగంలోకి దిగిన‌ట్టు ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. త‌న త‌మ్ముడు రాజేశ్వ‌ర్ ఏఈ ప‌రీక్షకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని, అత‌నికి ప్ర‌శ్న‌ప‌త్రాలు కావాలంటూ ఆమె ప్ర‌వీణ్ తో రూ.10 ల‌క్ష‌ల‌కు బేరం కుదుర్చుకుంది. నిజానికి రాజేశ్వ‌ర్‌కు ఏఈ ప‌రీక్ష రాసేందుకు అర్హ‌త కూడా లేదు. అత‌ను టీటీసీ చ‌దివాడు. కాంట్రాక్టు ప‌నులు చేస్తున్నాడు.

ప్ర‌శ్న‌ప‌త్రాలు స‌మ‌కూర్చుతానంటూ.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన కె.నీలేష్ నాయ‌క్‌, పి.గోపాల్ నాయ‌క్‌ల‌తో ముందే డీల్ కుదుర్చుకున్న రేణుక వారితో రూ.14 ల‌క్ష‌ల‌కు బేరం సెట్ చేసుకుంది. వారివ‌ద్ద డ‌బ్బు తీసుకుని అందులో రూ.10 ల‌క్ష‌లు ప్ర‌వీణ్‌కు ఇచ్చింది.

వ‌నప‌ర్తి జిల్లా బుద్దారం గ్రామ ప‌రిధిలోని బాలిక‌ల ఎస్సీ గురుకుల పాఠ‌శాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తున్న రేణుక ప్ర‌శ్న‌ప‌త్రాల వ్య‌వ‌హారం న‌డిపేందుకు ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునేవర‌కు 16 రోజులు సెల‌వులు పెట్టిన‌ట్టు తేలింది. ఇందుకోసం ప్రిన్సిపల్‌కు ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పిన‌ట్టు తెలిసింది. త‌న కుమారుడికి బాగోలేద‌ని ఒక‌సారి, మ‌రిది చ‌నిపోయాడ‌ని మ‌రోసారి.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ కేసులో ఆమె పాత్ర బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో ఆమెను స‌స్పెండ్ చేయ‌నున్న‌ట్టు గురుకుల సొసైటీ వ‌ర్గాలు తెలిపాయి.

First Published:  16 March 2023 7:44 AM GMT
Next Story