Telugu Global
Telangana

మునుగోడులో కొత్త సంప్రదాయం.. ఒక ఓటు, రెండు పేమెంట్లు..

పోలింగ్ రోజు లేదా పోలింగ్ కి ముందురోజు డబ్బులు ముట్టజెప్పే సంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు ఈ డబ్బు పంపిణీ రెండు దఫాలుగా జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం తొలి విడత పంపిణీ పూర్తి కావొచ్చిందట.

మునుగోడులో కొత్త సంప్రదాయం.. ఒక ఓటు, రెండు పేమెంట్లు..
X

18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకున్న అభ్యర్థి మునుగోడులో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 200 కార్లు, 2వేల బైక్ లకు ఆల్రడీ ఆర్డర్ ఇచ్చేశారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ దశలో ఇప్పుడు మునుగోడు ప్రజలకు కొత్త అనుభవం ఎదురవబోతోంది. గతంలో ఎక్కడైనా పోలింగ్ రోజు, లేదా పోలింగ్ కి ముందురోజు డబ్బులు ముట్టజెప్పే సంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు ఈ డబ్బు పంపిణీ రెండు దఫాలుగా జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం తొలి విడత పంపిణీ పూర్తి కావొచ్చిందట. వెయ్యి రూపాయలనుంచి 10వేల వరకు ఓటుకి నోట్లు ముట్టజెబుతున్నారు.

తొలి విడత పంపిణీ ప్రశాంతంగా పూర్తయితే, రెండోసారి పోలింగ్ ముందు రోజు డబ్బు సంచులు ఊళ్లలోకి వచ్చేస్తాయి. అప్పుడు మరోసారి డబ్బులు పంపిణీ చేస్తారని అంటున్నారు. అంటే మొత్తంగా ఒక్కో ఓటుకి 25వేల రూపాయల వరకు బీజేపీ ఖర్చు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆ స్థాయిలో ఖర్చు పెడతాయా లేదా అనేది తేలాల్సి ఉంది.

ఆ స్థాయిలో ఎందుకు..?

ఓటుకి పాతికవేలు ఖర్చు పెట్టడమంటే మాటలు కాదు. కానీ మునుగోడు అందరికీ ప్రతిష్టాత్మకం అయింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇది మినీ అసెంబ్లీ సంగ్రామంగా చెబుతున్నారు. అందుకే అన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ధనబలాన్నే నమ్ముకుంది. అమ్ముడుపోయానంటూ బహిరంగంగానే ఒప్పుకున్న రాజగోపాల్ రెడ్డి, ఓటర్లను కొనేందుకు అస్సలేమాత్రం మొహమాట పడటంలేదు. అందుకే రెండు దఫాలు డబ్బు పంపిణీకి ఆయన సిద్ధపడ్డారని తెలుస్తోంది. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. ఇలా చోటామోటా నేతలకు పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయట. ఎన్నికలకు ముందు ఫలానా నాయకుడు పార్టీ మారారు అనే వార్త కొన్ని ఓట్లను ప్రభావితం చేయగలదు అని నమ్ముతున్నారు పెద్ద నాయకులు. అందుకే నయానో భయానో.. వారు చిన్న చిన్న నేతల్ని టార్గెట్ చేస్తున్నారు.

మునుగోడు బెంచ్ మార్క్..

తెలంగాణలో ఇప్పటి వరకూ ఎన్నికల్లో జరిగిన ఖర్చు వేరు, ఇప్పుడు జరగబోయే ఖర్చు వేరు అన్నట్టుగా ఉందట మునుగోడు పరిస్థితి. భవిష్యత్తులో కూడా మునుగోడుకి ముందు, మునుగోడు తర్వాత అని ఎన్నికల ఖర్చుని బేరీజు వేసుకునేట్టుగా ఇక్కడ ఉప పోరు ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ ధన బలాన్నే నమ్ముకుంటే, టీఆర్ఎస్ ప్రజా బలంపైనే నమ్మకం ఉంచి సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. కాంగ్రెస్ గత విజయంపై నమ్మకం పెట్టుకుంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా, కేడర్ పార్టీతోనే ఉందని, మునుగోడులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంటున్నారు హస్తం పార్టీ నాయకులు.

First Published:  11 Oct 2022 9:43 AM GMT
Next Story