Telugu Global
Telangana

నేడు కొత్త సచివాలయం ప్రారంభం.. ఉద్యోగులతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్, మంత్రులు తమ ఛాంబర్లలో తొలి ఫైళ్లపై సంతకాలు చేసిన తర్వాత ఎమ్మెల్యేలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

నేడు కొత్త సచివాలయం ప్రారంభం.. ఉద్యోగులతో సీఎం కేసీఆర్ సమావేశం
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ఇవాళ ప్రారంభిస్తోంది. నేటి మధ్యాహ్నం 1.20 నుంచి 2.04 మధ్య సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తారు. ముందుగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. పండితులు సుదర్శన యాగం, చండీయాగం నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం 1.30లోపే పూర్తి కానున్నాయి. ఆ తర్వాత సచివాలయాన్ని ప్రారంభించి సీఎంతో పాటూ.. మంత్రులు, అధికారులు తమ ఛాంబర్లలో ఆసీనులవుతారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

సీఎం కేసీఆర్, మంత్రులు తమ ఛాంబర్లలో తొలి ఫైళ్లపై సంతకాలు చేసిన తర్వాత ఎమ్మెల్యేలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. కేసీఆర్ గృహ లక్ష్మి పథకానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేయనున్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై సంతకం పెట్టనున్నారు. సీఎం కేసీఆర్ ఛాంబర్ ఆరో అంతస్తులో ఉండగా.. మంత్రి కేటీఆర్ ఛాంబర్ మూడో ఫ్లోర్‌లో ఉన్నది.

ఇక తొలి సమీక్షా సమీవేశాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రేపు నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి చేసే ఈ సమీక్షలో అధికారులు పాల్గొననున్నారు. ఇప్పటికే 16 అంశాలతో కూడిన ఎజెండాను రూపొందించారు. 2023-24 వానకాలం సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు వేదికల్లో సమావేశాల నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ యాక్షన్‌ ప్లాన్‌, యాసంగి మక్కల కొనుగోళ్లు, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల పనితీరు తదితర అంశాలను ఎజెండాలో చేర్చారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో పిలిచే ఈ కొత్త సచివాలయం భూకంపాల్ని తట్టుకునేలా నిర్మించారు. ఇందులో ప్రవేశానికి స్మార్ట్ కార్డ్‌తో పాసులు జారీ చేస్తారు. మొత్తం 300 సీసీ కెమెరాలు, 300 మంది పోలీసుల నిఘా ఉంటుంది. కొత్త సెక్రటేరియట్‌లో 635 గదులు, 30 కాన్ఫరెన్స్ హాళ్లు ఉన్నాయి. మొత్తం 24 లిఫ్టులు, 34 గుమ్మటాలు ఉన్నాయి. కరెంటు కోసం సోలార్ ప్యానెల్స్ కూడా ఉన్నాయి. దీని ఏసీ కోసం ప్రత్యేక ప్లాంట్ కూడా నిర్మించారు. సెక్రటేరియట్ ఆవరణలో 2 బ్యాంకులు, ఏటీఎం కియోస్క్‌లు, పోస్ట్ ఆఫీస్ , రైల్వే కౌంటర్, బస్ కౌంటర్ వంటివి ఉన్నాయి.


First Published:  30 April 2023 5:12 AM GMT
Next Story