Telugu Global
Telangana

కేసీఆర్ నిర్మాణంలో 'నూతన భారత్'!

జాతీయ అంశాలపై జాతీయ పార్టీల వైఖరి సరిగ్గాలేదని కేసీఆర్‌ వాదన. ఆయన ఈ దిశగా ప్రత్యామ్నాయ శక్తిని నిర్మించాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి ముందుకు వెడుతున్నారు.

కేసీఆర్ నిర్మాణంలో నూతన భారత్!
X

కేసీఆర్ నిర్మాణంలో 'నూతన భారత్'!

"ఏదీ చిన్నగా ఆలోచించకూడదు.పెద్దగా ఆలోచించాలి. అంతే భారీగా ప్రణాళికలు వేసి అమలు చేయాలి" అని కేసీఆర్ చెబుతుంటారు. ఆయన ఈ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముకున్న వ్యక్తి. మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరు. ప్రసంగ కళలో ఆయన నిష్ణాతుడు. రాజకీయాల్లో ఇన్‌స్టంట్‌ ఫలితాలు ఉండవు. దీర్ఘకాలమైనా సరే, అన్నీ పథకం ప్రకారం అమలు చేస్తేనే ఆశించిన ప్రయోజనం లభిస్తుందన్నది కేసీఆర్ థియరీ.

'' పరిస్థితి సానుకూలంగా ఉంటేనే ముందడుగు వేయండి..లేకపోతే ఎక్కడున్నారో అక్కడే ఉండండి'' క్రీస్తు పూర్వం 4 శతాబ్దానికి చెందిన చైనా యుద్ధరంగ నిపుణుడు సుంజు అన్నాడు. సరిగ్గా అదే ఫార్ములాను కేసీఆర్ అనుసరిస్తున్నారు. స్టాలిన్, ఫెడల్ కాస్ట్రో, నెపోలియన్, మావో సహా ఎందరో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజకీయ నాయకులు, యోధులు సుంజు సిద్ధాంతాన్ని అమలుచేసిన వాళ్ళే. సుంజు 'ద ఆర్ట్ ఆఫ్ వార్'ను కేసీఆర్ కాచి వడబోశారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక సందర్భంలో అన్నారు. ఎప్పుడైనా సరే తనకు అనువుగా ఉన్నప్పుడే యుద్ధం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకుంటున్నారు. అలాంటి పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే 2018లో ముందస్తు ఎన్నికల బరిలోకి ప్రత్యర్థులను లాగేశారు. ప్రత్యర్థులు అప్రమత్తంగా లేనప్పుడే వారిని చావుదెబ్బ కొట్టాలని కూడా సుంజు చెప్పిందే!

కేసీఆర్ ప్రత్యేక తెలంగాణను గెలిచిన విజేత. ఇక మొత్తం భారతదేశాన్ని గెలుస్తారా? అన్నదే ప్రశ్న. ఆయన జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే పలు సవాళ్లు ఉన్నవి. దక్షిణ భారతదేశం నుంచి జాతీయ రాజకీయాలను నడిపినవారు కానీ, నడిపి విజయాన్ని నమోదు చేసిన వారు కానీ లేరు. ప్రతిభ, పట్టుదల, నిరంతర శ్రమ కేసీఆర్ వ్యూహాత్మక వైఖరికి బలమైన అంశాలు. ఆయనది ఇప్పటిదాకా ఓటమి ఎరుగని ప్రయాణం. ఆయన బలమైన నాయకుడు. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల ప్రతిభ, నైపుణ్యాలు ఆయన సొంతం. ఉద్యమ కాలంలో తెలంగాణవాదాన్ని అత్యంత అద్భుతంగా జనంలోకి తీసుకువెళ్ళారు. వాక్పటిమ అదనపు బలం. ''లక్ష్యం ఖచ్చితంగా ఉన్నప్పుడు ఏదీ కష్టంగా అనిపించదు'' అనే నానుడిని నమ్మే వ్యక్తి కేసీఆర్.

జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కేసీఆర్‌కు ఉన్న‌ అవకాశం... ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సరిహద్దుల్లోని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టి తెలంగాణ అభివృద్ధిని ప్రదర్శించి ఓటర్లను మచ్చిక చేసుకోవడం. తెలంగాణతో ఆయా రాష్ట్రాల ప్రజలకు అనుబంధం కేసీఆర్‌కు కొంత కలిసిరావచ్చు. జాతీయ పార్టీగా అవతరించడానికి ఈ సానుకూలత ముఖ్యమైనది.

అలాగే కేసీఆర్ మిగతా ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీలకన్నా ఎన్నో రెట్లు ఆర్థికంగా శక్తిమంతుడు. ఉత్తరాది రాష్ట్రాలలో చాలా రాజకీయ శక్తులకు ఆర్ధిక వనరులు లేవు. అలాంటి పార్టీలను కేసీఆర్ ఆకర్షించడం కష్టమేమీ కాదు. ఇండియాలో ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడినవే. డబ్బు లేకుండా రాజకీయమే లేదు. ఎన్నికలు అంతకన్నా లేవు. హుజురాబాద్, మునుగోడు వంటి ఉపఎన్నికల్లో ధన ప్రవాహం ఎట్లా సాగిందో ప్రపంచమంతా చూసింది. టిఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా వందల కోట్లను ఖర్చు చేస్తున్నవి.

కాగా టీఆర్ఎస్ తెలంగాణను రెండు సార్లు కైవసం చేసుకున్నది. కానీ గడచినా కొన్నేళ్లుగా బీజేపీ అనూహ్యంగా బలపడడం పట్ల తెలంగాణ సమాజం ఆందోళన చెందుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభావం పెరుగుతుండటం ఒక వాస్తవం. ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందనడానికి మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో నలుగురు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్ర. బీజేపీకి కర్ణాటక తరువాత తెలంగాణే టార్గెట్. బీజేపీని ఢీ కొట్టాలంటే తన శక్తి సామర్ధ్యాలు జాతీయ స్థాయిలో రుజువు చేయవలసిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నారు. అందుకే ''బీఆర్ఎస్‌కు పునాది మునుగోడు ఫలితం'' అని కేసీఆర్ ఊరకే అనలేదు. మునుగోడులో బీజేపీ, టిఆర్ఎస్ మధ్య జరిగిన భీకర పోరాటం అందరికీ తెలుసు. అందువల్ల బీజేపీని ఎదుర్కోవల్సిన చారిత్రక అవసరం కేసీఆర్‌కు ఉన్నట్టు తెలంగాణ సమాజం కోరుతోంది.

ఎనిమిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్మాదం లేదు. హింస లేదు. శాంతిభద్రతలు సజావుగా ఉన్నందున, ప్రశాంత పరిస్థితులు కొనసాగుతున్నందునే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నవి. చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించిన దాఖలాలు లేవన్న సంగతి కేసీఆర్‌కు తెలియనిది కాదు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నిర్మాత లాలూ ప్రసాద్ వంటి నాయకులు కాంగ్రెస్‌తో ప్రయాణించాలని అనుకుంటున్నారు. అలాంటి వారు కేసీఆర్‌తో జతకట్టడంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. శరద్ పవార్, ఉద్ద‌వ్ ఠాక్రే, మమతా, అఖిలేశ్ తదితర నాయకులు కేసీఆర్‌కు మద్దతు ఇచ్చే అంశంపై సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు.

కేసీఆర్ ఏమి చేసినా ముందుగా చాలా హోమ్ వర్క్ చేస్తారు. మేధో మధనం చేస్తారు. అందులో భాగంగానే ఆయన నాలుగేండ్లుగా వివిధ పార్టీలతో, నాయకులతో, నిపుణులు, మేధావులతో చర్చలు జరపుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో80, మహారాష్ట్రలో 48, పశ్చిమబెంగాల్‌లో 42, బిహార్‌లో 40, తమిళనాడులో 39 లోక్‌సభ సీట్లు ఉన్నందున వీటిలో సగం సీట్లు గెలుచుకున్నా, అవి బీఆర్ఎస్ గూటికి చేరినా గొప్ప బలం చేకూరుతుంది. అయితే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ కేసీఆర్‌పై ఆధార పడకపోవచ్చును. టీఆర్ఎస్ ఒక దశలో బీజేపీకి సన్నిహితంగా మెలిగింది. వ్యూహాత్మకంగానే కేసీఆర్ కేంద్రంలోని బీజేపీకి మద్దతు తెలిపింది. వివిధ కారణాల వలన రెండు పక్షాల మధ్య వైరం ముదిరింది. శత్రు శిబిరాలుగా బలగాలను మోహరిస్తున్న తీరు మునుగోడులో కనిపించింది.

కొన్ని నిర్ణయాలను నిష్కర్షగా అమలు చేస్తారన్న నిందను కేసీఆర్ 2014 నుంచి మోస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా తీసుకుంటున్నారనో, నియంతృత్వ ధోరణి అనో కొందరు టిఆర్ఎస్ వ్యతిరేక మేధావులు దుమ్మెత్తి పోస్తూ ఉండవచ్చు. కానీ ఆ నిర్ణయాలకు ప్రజామోదం ఉన్నదా? లేదా? అన్నదే కేసీఆర్‌కు ముఖ్యం. ఎవరో ఏదో అనుకుంటారనీ, విమర్శలు వస్తాయనో అనుకునే రకం కాదు. ఆయన సిలబసే మిగతా రాజకీయావేత్తలకు భిన్నమైనది. తాను చేస్తున్న పనులు జనరంజకమా కాదా అన్న అంశానికే కేసీఆర్ ప్రాధాన్యమిస్తారు. జిల్లాల విభజన అయినా, ధరణి అయినా, రైతుబంధు వంటి సంక్షేమ అస్త్రాలైనా అంతే! ఇతరుల నుంచి ప్రభావితం కావడానికి ఇష్టపడరని కేసీఆర్‌ను 2001 నుంచి దగ్గరగా పరిశీలిస్తున్న వ్యక్తులు అంటుంటారు. కేసీఆర్ ఇండిపెండెంట్‌గా ఆలోచిస్తూ ఇండిపెండెంట్‌గానే నిర్ణయాలు తీసుకుంటారు.

''ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా తెలంగాణ సాధిస్తాం. ఈ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంటే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి'' అని 2001 మే 17న కేసీఆర్ కరీంనగర్‌ సింహగర్జనలో పిలుపునివ్వడం గురించి ఇప్పటికీ కొందరు గుర్తు చేస్తున్నారు.పేదల ప్రజల పట్ల తపనను ప్రదర్శించిన వాళ్లలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి లాగా కేసీఆర్ కూడా గుర్తింపు పొందారు. ఇక ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కు రాకుండా ప్రగతి భవన్‌కే పరిమితయ్యారని, ఇది రాజరికపు పోకడ అని వచ్చిన, వస్తున్న విమర్శలన్నింటికీ 2018లో రెండో సారి 88 సీట్లకు పైగా భారీ మెజారిటీతో జవాబిచ్చినట్లయ్యింది.

జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించిన బలమైన కాంగ్రెస్ నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామందే ఉన్నప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ తరపున పని చేశారు. ఎన్టీయార్‌, చంద్రబాబు తరువాత కేసీఆర్, జగన్‌ బలమైన ప్రాంతీయ నాయకులుగా ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరహాలోనే జగన్‌కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు. బీజేపీకి జాతీయస్థాయి ప్రత్యామ్నాయం గురించి, ఎజండా గురించి కేసీఆర్ చాలాకాలంగా మాట్లాడుతున్నారు. జాతీయ అంశాలపై జాతీయ పార్టీల వైఖరి సరిగ్గాలేదని కేసీఆర్‌ వాదన. ఆయన ఈ దిశగా ప్రత్యామ్నాయ శక్తిని నిర్మించాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి ముందుకు వెడుతున్నారు.

Next Story