Telugu Global
Telangana

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త మోసం.. - కొరియర్‌ పేరిట రూ.98 లక్షలు కొల్లగొట్టిన వైనం

అప్రమత్తమైన తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తొలుత బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకుకు ఫోన్‌ చేశారు. ఆ డబ్బు కశ్మీర్‌లోని బారాముల్లా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో జుజు అనే వ్యక్తి ఖాతాలో జమయ్యాయని వారు వెల్లడించారు.

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త మోసం.. - కొరియర్‌ పేరిట రూ.98 లక్షలు కొల్లగొట్టిన వైనం
X

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతుల్లో తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రజలను మోసం చేసి పెద్ద మొత్తంలో సొమ్మును స్వాహా చేస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారికి వారం రోజుల క్రితం ఒక ఫోన్‌ వచ్చింది. తాము కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమని పరిచయం చేసుకున్నారు. ఫెడక్స్‌ కొరియర్‌ ద్వారా మీ పేరుపై ఒక పార్శిల్‌ వచ్చిందని, అందులో మత్తుమందులు ఉన్నాయని, కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ వ్యాపారి తనను రక్షించమని వేడుకున్నాడు. దీంతో వారు.. తాము చెప్పిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు. అసలే భయంతో ఉన్న వ్యాపారి వెంటనే రూ.98 లక్షలు బదిలీ చేశాడు. ఆ తరువాత అనుమానం వచ్చి వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు.

వెంటనే అప్రమత్తమైన తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తొలుత బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకుకు ఫోన్‌ చేశారు. ఆ డబ్బు కశ్మీర్‌లోని బారాముల్లా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో జుజు అనే వ్యక్తి ఖాతాలో జమయ్యాయని వారు వెల్లడించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు ఫోన్‌ చేయగా, అక్కడి నుంచి ఆ సొమ్ము 5 వేర్వేరు రాష్ట్రాల్లోని బ్యాంకులకు మళ్లించారని తేలింది. వెంటనే ఆ ఐదు బ్యాంకులకు ఫోన్‌ చేస్తే అక్కడి నుంచి మరో ఆరు ఖాతాలకు మళ్లించారని వెల్లడైంది. ఆ బ్యాంకులకు కూడా ఫోన్‌ చేసిన అధికారులు జరిగిన మోసం గురించి వివరించి.. దీనిపై కేసు నమోదు చేస్తున్నామని, ఆ డబ్బు ఎవరూ డ్రా చేయకుండా నిలిపివేయాలని కోరారు.

అయితే అప్పటికే సైబర్‌ నేరగాళ్లు రూ.15 లక్షలు డ్రా చేశారు. మిగిలిన రూ.83 లక్షలు మాత్రం అధికారులు నిలిపివేయగలిగారు. ఇదిలావుంటే ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారులు సైబర్‌ నేరగాళ్ల మెరుపు వేగానికి విస్తుపోయారు. ఈ కేసు ద్వారా వారి నెట్‌వర్క్‌ ఎంత పటిష్టంగా ఉందనేది గుర్తించి ఆశ్చర్యపోయారు. ఎట్టకేలకు రూ.83 లక్షలు రాబట్టగలిగారు.

First Published:  20 Jan 2024 3:32 AM GMT
Next Story