Telugu Global
Telangana

ఒక్క సీటు వదులుకుంటావా?.. 17కు ఎసరు పెట్టమంటావా?

వరంగల్‌ స్థానంలో పోటీకి కాంగ్రెస్‌లో పెద్దఎత్తున నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ పోటీచేస్తే కరీంనగర్‌ సీటు తమకు ఇవ్వాలని సీపీఐ కోరుతోంది.

ఒక్క సీటు వదులుకుంటావా?.. 17కు ఎసరు పెట్టమంటావా?
X

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు కొలిక్కిరావడం లేదు. రాష్ట్రంలో ఏదైనా ఓ స్థానం నుంచి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించింది. వరంగల్‌ లేదా కరీంనగర్‌ స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం ముందు ప్రతిపాదన ఉంచింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌ పెద్దలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తొలి నుంచి వరంగల్‌ స్థానం ఇవ్వాలని సీపీఐ డిమాండ్‌ చేస్తోంది. అభ్యర్థిని కూడా సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, కాంగ్రెస్ పొత్తు ఊసే ఎత్తడం లేదు.

వరంగల్‌ స్థానంలో పోటీకి కాంగ్రెస్‌లో పెద్దఎత్తున నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ పోటీచేస్తే కరీంనగర్‌ సీటు తమకు ఇవ్వాలని సీపీఐ కోరుతోంది. ఇప్పటికే సీపీఐ సీనియర్‌ నేత చాడ వెంకటరెడ్డి కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశమై కరీంనగర్‌ సీటుపై చర్చించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో తాము బలంగా ఉన్నాం. అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నామని సీపీఐ నేతలు చెప్తున్నారు. గతంలో హుస్నాబాద్‌, సిరిసిల్లలో సీపీఐ విజయం సాధించగా, మానకొండూరు నియోజకవర్గంలోనూ బలంగా ఉన్నామని చెప్తున్నారు.

షెడ్యూల్‌ విడుదలైనా పొత్తుల పై క్లారిటీ లేకపోవడంపై సీపీఐ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. దీంతో అవసరమైతే రాష్ట్రంలోని మొత్తం స్థానాల్లో బరిలోకి దిగే అవకాశాలను సీపీఐ పరిశీలిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నారు.

First Published:  25 March 2024 8:24 AM GMT
Next Story