Telugu Global
Telangana

జెండా ఆవిష్కరణకు, ఎగురవేతకు తేడా తెలియదా మేడం..

ఈ ట్వీట్‌ను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై కి జాతీయ జెండా ఎగురవేయడానికి.. ఆవిష్కరించడానికి మధ్య ఉన్న తేడా తెలియదా..? అని ప్రశ్నిస్తున్నారు.

జెండా ఆవిష్కరణకు, ఎగురవేతకు తేడా తెలియదా మేడం..
X

తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే విషయంలో బీజేపీ నాయకులే అసూయపడే స్థాయిలో గవర్నర్‌ తమిళిసై విమర్శలకు దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గవర్నర్ అయినప్పటికీ రాజకీయ నాయకుల తరహాలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఆమె ఏమాత్రం వెనుకాడడం లేదు. పక్క రాష్ట్రాలకు వెళ్లి కూడా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె ఆరోపణలకు దిగుతుండటం వివాదాస్పదమవుతోంది.

గవర్నర్ పరిధి దాటారని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలూ ఆమెకు అంతేస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో గవర్నర్ తీరుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇంత దూరం వచ్చాక ముసుగులో గుద్దులాట ఎందుకు మేడం.. ఏదైనా ఒక అసెంబ్లీ స్థానాన్ని ఎంపిక చేసుకొని బీఆర్ఎస్ పై పోటీ చేయవచ్చు కదా అని కొందరు నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

మరో విషయంలోనూ.. తాజాగా తమిళిసై అవగాహన సామర్థ్యంపై ట్రోలింగ్ జరుగుతోంది. ''రిపబ్లిక్ డే రోజు రాజ్ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశాను'' అంటూ తెలుగు, ఇంగ్లీష్ లో గవర్నర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై కి జాతీయ జెండా ఎగురవేయడానికి.. ఆవిష్కరించడానికి మధ్య ఉన్న తేడా తెలియదా..? అని ప్రశ్నిస్తున్నారు. జాతీయ జెండాను ఎగురవేయడానికి, ఆవిష్కరించడానికి మధ్య తేడాను గవర్నర్‌కు వివరించే ప్రయత్నం మొదలుపెట్టారు.

రిపబ్లిక్ డే రోజు భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు జెండాను ఆవిష్కరిస్తారని.. ఆగస్టు 15న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు జెండాను ఎగురవేస్తారంటూ తేడాను నెటిజన్లు వివరిస్తున్నారు. బ్రిటీష్ పాలన అంతమై స్వాతంత్రం వచ్చిన రోజైనా ఆగస్టు 15న ప్రధాని, ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని జెండా దిమ్మెకు కింది నుంచి పైకి లాగి వేస్తారు. దాని అర్థం.. బ్రిటీష్ పాలన అంతమై సొంత పాలన మొదలైందని అర్థం.

అదే రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి, గవర్నర్లు జెండాను ఆవిష్కరిస్తారు. రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాను స్తంభానికి పై భాగంలో అప్పటికే కట్టి ఉంచి.. అక్కడే కట్టు విప్పి ఆవిష్కరిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే? రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రిపబ్లిక్ డే నాటికి మన దేశానికి స్వాతంత్రం అప్పటికే వచ్చింది కాబట్టి. మన దేశం స్వతంత్రంగా ఇప్పటికే ఉంది అన్న భావనతో రిపబ్లిక్ డే నాడు జెండాను రాష్ట్రపతి, గవర్నర్లు ఆవిష్కరించడం ఆనవాయితీ. ఈ తేడా సామాన్యులకు తెలియకపోయినా.. గవర్నర్‌గా ఉన్నందున మీరు తప్పక తెలుసుకోవాలి అంటూ తమిళిసైకి నెటిజన్లు సూచిస్తున్నారు.

First Published:  27 Jan 2023 2:56 AM GMT
Next Story