Telugu Global
Telangana

పాలమూరులో పుంజుకుంటున్న వారసత్వ రాజకీయాలు

రాష్ట్రంలో ఆ పార్టీ కీలకనేతల్లో ఒకరిగా బిజీగా ఉండటంతో గద్వాల జిల్లాతో పాటు నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలను కుమార్తె స్నిగ్దారెడ్డి చూసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున గద్వాల నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

పాలమూరులో పుంజుకుంటున్న వారసత్వ రాజకీయాలు
X

సినిమాలు, రాజకీయాల్లో వారసత్వం అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. ఇప్పుడు కొన్ని పార్టీలు నెపోటిజంను ప్రోత్సహించడం లేదు. కానీ రాజకీయాల్లోకి రావాలనుకునే వారసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో ఎంతో మంది రాజకీయాలను వారసత్వంగా చేసుకొని ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తమ సొంత తెలివి తేటలతో, సామర్థ్యంతో ఎదిగిన వాళ్లు ఉన్నారు. ఇక మరో ఏడాదిన్నర లోపు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకుల వారసులు బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయంగా చాలా ప్రత్యేకమైనంది. ఇక్కడి ప్రజలు ఎప్పుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అంచనా వేయడం కష్టమే. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ కూడా ఈ జిల్లాలో తమ ఉనికిని చాటుకున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నా.. ఆ తర్వాత టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపింది. అయితే అడపాదడపా బీజేపీ కూడా ఇక్కడ ఉనికిని చాటుకుంది. తల్లిదండ్రుల వారసత్వంతో ఆయా పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్న వారసులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీరిలో కొంత మంది ఎమ్మెల్యేలు అయి.. అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఊవ్వీళ్లూరుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలుకుబడి ఉన్న రాజకీయ కుటుంబాల్లో డీకే అరుణ ఫ్యామిలీ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఈ కుటుంబం రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి డీకే అరుణ వచ్చినా.. 2004లో మాత్రం సమాజ్‌వాది పార్టీ టికెట్‌పై తొలిసారి గెలిచారు. కానీ వెంటనే కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆమె.. వైఎస్ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి గెలిచినా.. ఆ తర్వాత పార్టీకి దూరమై.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ కీలకనేతల్లో ఒకరిగా బిజీగా ఉండటంతో గద్వాల జిల్లాతో పాటు నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలను కుమార్తె స్నిగ్దారెడ్డి చూసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున గద్వాల నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇక మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి షాద్ నగర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఒక వేళ అక్కడ టికెట్ రాకుంటే.. మహబూబ్‌నగర్ నుంచి అయినా పోటీకి సిద్దమని చెప్తున్నారు. ఇక జడ్చర్ల, షాద్‌నగర్ లేదా మక్తల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్‌ను మరో వారసుడు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడు జీవన్ రెడ్డి ఆ మూడింటిలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి సై అంటున్నారు.

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం. అయితే ఈ సారి టికెట్ ఆయన కొడుకు అజయ్ ఆశిస్తున్నారు. ఇప్పటికే తనకంటూ సొంతగా క్యాడర్ ఏర్పరుచుకున్న అజయ్.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తనకు టికెట్ తప్పకుండా వస్తుందనే ధీమాతో అజయ్ ఉన్నారు. అయితే ఇదే నియోజకవర్గం అసెంబ్లీ టికెట్‌ను మరో రాజకీయ వారసుడు కూడా కోరుతున్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి మందా జగన్నాథం తనయుడు మందా శ్రీనాథ్ కూడా అలంపూర్ టికెట్ ఆశిస్తున్నాడు. ఆ మేరకు తండ్రి జగన్నాథం కూడా టికెట్ కోసం సహకారం అందిస్తున్నారు.

2014లో అలంపూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మందా శ్రీనాథ్ పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశారు. శ్రీనాథ్ పార్టీని కాపాడుకుంటూ రావడం వల్లే 2018లో అబ్రహాం గెలుపొందారు. తనకు టికెట్ రాకపోయినా 2018లో శ్రీనాథ్ పార్టీ కోసం పని చేశారు. ఈ సారి తప్పకుండా తనకు టికెట్ వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అచ్చంపేట నుంచి కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఎంపీ రాములుకు కుమారుడు. గతంలోనే ఆయనకు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ స్థానిక రాజకీయ సమీకరణల్లో పదవి దక్కకుండా పోయింది. ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భరత్ ప్రసాద్ కోరుకుటున్నారు. ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డికే మరోసారి టికెట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాజేశ్ రెడ్డి ఏం చేస్తారనేది మాత్రం సందిగ్దంగా ఉంది.

మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు ఏడుగురు రాజకీయ వారసులు బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆయా పార్టీలు వీరికి టికెట్లు ఇస్తారా? లేదంటే ఇప్పుడున్న సిట్టింగ్, గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికే టికెట్లు కేటాయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కొంత మంది రాజకీయ వారసులు ప్రస్తుతం ఉన్న పార్టీలో టికెట్లు దొరక్కపోతే వేరే పార్టీ నుంచైనా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

First Published:  3 Aug 2022 9:37 AM GMT
Next Story