Telugu Global
Telangana

వేదామృతం పేరు వివాదం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే..?

నీరా వేరు, కల్లు వేరని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వేదామృతం అనే పదంపై వివాదం ఉంటే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అన్ని పేర్లను పరిశీలించి, వేదామృతం అనే పేరుపై అభ్యంతరం లేదనుకున్న తర్వాతే ఆ పేరు పెట్టామన్నారు.

వేదామృతం పేరు వివాదం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే..?
X

హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్ కి వేదామృతం అనే పేరు పెట్టడం సరికాదంటూ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పేరు పెట్టడం హిందూ సంస్కృతిని అవమానించినట్టని, వేదాలను అపహాస్యం చేసినట్టవుతుందని బ్రాహ్మణ సంఘాల నాయకులు బ్రాహ్మణ సంస్థ పరిషత్ ఛైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వినతిపత్రం అందించారు. ఈ వివాదంపై ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

నీరా అంటే కల్లు కాదు..
Advertisement

నీరా వేరు, కల్లు వేరని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వేదామృతం అనే పదంపై వివాదం ఉంటే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అన్ని పేర్లను పరిశీలించి, వేదామృతం అనే పేరుపై అభ్యంతరం లేదనుకున్న తర్వాతే ఆ పేరు పెట్టామన్నారు. తాటి చెట్టును ప్రకృతి ఔషధంగా వేదాలు వర్ణించాయని, వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవలే నీరా కేఫ్ కి హైదరాబాద్ లో శంకుస్థాపన చేశారు నేతలు. అయితే వేదామృతం అనే పేరు పెట్టాలనుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

పేరు మార్చితే ఊరుకోం..

మరోవైపు వేదామృతం అనే పేరు మార్చితే ఊరుకునేది లేదని అంటున్నారు గౌడ సంఘాల నేతలు. నీరా ప్రాజెక్ట్ కి వేదామృతం అనే పేరు మార్చొద్దని సూచించారు. ఈమేరకు జైగౌడ్ ఉద్యమనేతలు తమ డిమాండ్ వినిపించారు. దీంతో ప్రభుత్వం ఈ పేరుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ ఎదురైంది.

Next Story