Telugu Global
Telangana

15 ఏళ్ల లీజుకు నీరా కేఫ్.. వాళ్లకు మాత్రమే అర్హత!

గీత కార్మికులకు రవాణా ఖర్చులతో కలిపి లీటరుకు రూ.200 చెల్లిస్తున్నారు. ఇలా సేకరించిన నీరాను కాస్త వడపోసి లీటరు రూ.300 విక్రయిస్తున్నారు.

15 ఏళ్ల లీజుకు నీరా కేఫ్.. వాళ్లకు మాత్రమే అర్హత!
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసింది. నగర వాసులకు నీరా రుచిని చూపించడమే కాకుండా.. రాష్ట్రంలో నీరా విక్రమాలను పెంచాలనే ఉద్దేశంతో ఈ కేఫ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ.16 కోట్ల వ్యయం చేసి ఈ నీరా కేఫ్‌ను నిర్మించింది. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా ఉన్న ఈ నీరా కేఫ్‌లో ఒకే సారి 500 మంది కూర్చునే వీలుంది. ఈ కేఫ్‌కు నిత్యం 500 మంది సందర్శిస్తున్నారని.. ప్రభుత్వానికి రోజుకు రూ.1 లక్ష వరకు ఆదాయం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా మొదట్లోనే ఈ నీరా కేఫ్‌ను భవిష్యత్‌లో లీజ్‌కు ఇస్తామని చెప్పారు. టూరిజం శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి.. ప్రైవేట్ వ్యక్తులకు 2 ఏళ్ల పాటు లీజుకు ఇస్తామని ప్రకటించారు. తాజాగా ఈ నీరా కేఫ్‌ను 15 ఏళ్ల పాటు లీజ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. టూరిజం డిపార్ట్‌మెంట్, ఎక్సైజ్ శాఖ కలిసి నిర్వహిస్తున్న ఈ నీరా కేఫ్‌కు అవసరమైన నీరాను గీత కార్మిక సంఘాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. గీత కార్మికులకు రవాణా ఖర్చులతో కలిపి లీటరుకు రూ.200 చెల్లిస్తున్నారు. ఇలా సేకరించిన నీరాను కాస్త వడపోసి లీటరు రూ.300 విక్రయిస్తున్నారు.

హైదరాబాద్ నగర శివారులోని నందన అడవుల్లోని పదుల ఎకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరాను సేకరించి.. ఐస్ బాక్సుల్లో నింపి నీరా కేఫ్‌కు తరలిస్తున్నారు. ఈ ప్రక్రియను ప్రభుత్వ ఉద్యోగులు చూడటం అసౌకర్యంగా ఉంది. అనుభవం ఉన్న గీత కార్మికులు అయితేనే త్వరగా ఈ పనులు చేయగలుగుతారు. అందుకే నీరా కేఫ్‌ను కేవలం సొసైటీలకు మాత్రమే లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో నీరాను విక్రయించే సొసైటీలు చాలా ఉన్నాయి. వీటిలో రిజస్టర్డ్ సొసైటీలకు నీరా కేఫ్ లీజు టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించారు. కేవలం సొసైటీలకే మాత్రమే ఈ టెండర్లు అప్పగిస్తామని.. ఇతర ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

First Published:  25 Sep 2023 5:24 AM GMT
Next Story