Telugu Global
Telangana

ఎమ్మార్ కేసులో తెలంగాణకు అనుకూలంగా తీర్పు..

ఆస్తులపై TSIICకే అధికారాలున్నాయని స్పష్టం చేస్తూ ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల‌కు సంబంధించి న‌ష్ట‌ప‌రిహారాన్ని TSIICకే చెల్లించాలని ఆదేశించింది.

ఎమ్మార్ కేసులో తెలంగాణకు అనుకూలంగా తీర్పు..
X

తెలంగాణలో ఎమ్మార్ హిల్స్ టౌన్ షిప్ కి సంబంధించిన కేసులో నేషనల్ లా ట్రిబ్యునల్.. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) కి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ వివాదంలో.. TSIIC కి తెలియకుండా ఎమ్మార్ టౌన్ షిప్ కి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగకూడదని, నష్ట పరిహారాన్ని కూడా TSIIC కి మాత్రమే చెల్లించాలని పేర్కొంది.

అసలు కేసేంటి..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ ని దుబాయ్‌ కి చెందిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సంస్థ కి అప్పగించారు. ఆ తర్వాత మారిషస్ కి చెందిన ఎమ్మార్ హోల్డింగ్స్ కూడా భాగస్వామిగా చేరింది. ప్రాజెక్ట్ పేరు 'ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌ షిప్‌' ఇందులో APIIC వాటా 26 శాతం కాగా, ఎమ్మార్‌ గ్రూప్‌ వాటా 74 శాతం. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లో గోల్ మాల్ జరిగింది. గజం స్థలం విలువ రూ.40 వేలు ఉండగా, దాన్ని రూ.5 వేలకే విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో APIIC, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ని ఆశ్రయించింది. దీంతో 210 ఎకరాల భూముల లావాదేవీలపై ట్రిబ్యునల్‌ స్టే విధించింది.

ఆ తర్వాత కొత్త కథ మొదలైంది. ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగుతున్న సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది. APIIC తోపాటు తెలంగాణ కోసం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) ఏర్పడింది. వివాదం ఉన్న ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి, ఈ కేసులో పరిహారం తమకే చెందాలని TSIIC పిటిషన్‌ దాఖలు చేసింది. దీనికి ఎమ్మార్‌ గ్రూప్‌ అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్‌ ప్రకారం తెలంగాణలోని APIICకి చెందిన ఆస్తులన్నింటికీ TSIIC యాజమాన్య హక్కులు సంక్రమించాయని వివరించింది. ఈ కేసులో ఎమ్మార్‌ గ్రూప్‌ తమకు తెలియకుండా ఆస్తుల విషయంలో లావాదేవీలు జరపకుండా ఆపాలని నేషనల్ ట్రిబ్యునల్ ని కోరింది.

ఈ కేసులో తాజాగా నేషనల్ ట్రిబ్యునల్ TSIICకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆస్తులపై TSIICకే అధికారాలున్నాయని స్పష్టం చేస్తూ ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల‌కు సంబంధించి న‌ష్ట‌ప‌రిహారాన్ని TSIICకే చెల్లించాలని ఆదేశించింది. దీంతో తెలంగాణలోని ఆస్తుల పరిరక్షణ విషయంలో మరోసారి TSIIC విజయం సాధించినట్టయింది.

First Published:  29 July 2022 3:08 AM GMT
Next Story