Telugu Global
Telangana

వైఎస్ షర్మిల డ్రామాలు ఆడుతున్నారు : పెద్ది సుదర్శన్ రెడ్డి

షర్మిల చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ను తాలిబన్‌గా పోల్చిన షర్మిల వ్యాఖ్యలను గవర్నర్ సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు.

వైఎస్ షర్మిల డ్రామాలు ఆడుతున్నారు : పెద్ది సుదర్శన్ రెడ్డి
X

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల డ్రామలు ఆడుతున్నారని, ఇప్పటికైనా ఆమె అసత్య ప్రచారాలు మానుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. ఇటీవల షర్మిల నర్సంపేటలో పర్యటించిన సమయంలో జరిగిన ఘటనలు, హైదరాబాద్‌లో పోలీసులు తనతో వ్యవహరించిన తీరును వివరించడానికి తెలంగాణ గవర్నర్ తమిళిసైని షర్మిల కలిశారు. ప్రభుత్వ పాలనపై కూడా గవర్నర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడికి సంబంధించిన విషయాలపై జోక్యం చేసుకోవాలంటూ వినతిపత్రం కూడా ఇచ్చారు. దీనిపై పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు.

నర్సంపేట పర్యటనలో తనపై దాడి జరిగిందని, తలకు గాయమైందని టీవీలో చూపించారు. కానీ, నిన్న టీవీల్లో చూస్తే గాయం మాయమైపోయింది. ఆమె ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. ఆమెవి అన్నీ డ్రామాలేని విమర్శించారు. మొన్న అయిన గాయం ఇవ్వాళ ఎందుకు మాయమైందో గవర్నర్ ఆమెను అడిగి ఉండాల్సిందని అన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని షర్మిల ఆఫ్గానిస్తాన్‌తో పోల్చారు. మరి ఇప్పుడు గవర్నర్ తమిళిసై తెలంగాణకు పని చేస్తున్నారా? అఫ్గానిస్తాన్‌కా అని సుదర్శన్ ప్రశ్నించారు.

షర్మిల చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ను తాలిబన్‌గా పోల్చిన షర్మిల వ్యాఖ్యలను గవర్నర్ సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా షర్మిల అసత్య ప్రచారాలను మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే మొన్న దాడి ఘటన జరిగిందన్న విషయం గుర్తుంచుకోవాలని సుదర్శన్ రెడ్డి అన్నారు. స్థానికంగా ఉన్న మహిళల నుంచి వచ్చిన స్పందనే అని, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం మాని.. స్థానిక సమస్యలపై పాదయాత్ర చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

ఇప్పటికైనా ఇలాంటి పద్దతులు మానుకోని ప్రశాంతంగా పాదయాత్ర చేసుకోవాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. ఇలాంటి డ్రామాలు చేస్తే ప్రజలు మరోసారి అలాగే రియాక్ట్ అవుతారని పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Next Story