Telugu Global
Telangana

బెయిల్‌పై విడుదలైన షర్మిల..

వైఎస్ షర్మిలతో పాటు మరో ఆరుగురిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పంజగుట్ట ఎస్సై అఖిల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

బెయిల్‌పై విడుదలైన షర్మిల..
X

ప్రగతి భవన్ ముట్టడి అంటూ హైడ్రామాతో హడావిడి పెట్టిన షర్మిల అండ్ టీమ్ కి నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై వారికి జామీను ఇచ్చింది. షర్మిలతోపాటు అరెస్ట్ అయిన వైఎస్సార్టీపీ నేతలు కూడా బెయిల్‌పై విడుదలయ్యారు.


శాంతిభద్రతల సమస్య..

ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన షర్మిల లోటస్ పాండ్ నుంచి పోలీసుల కళ్లుగప్పి రోడ్డుపైకి వచ్చారు. కారులో హైడ్రామా స్టార్ట్ చేశారు. చివరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో కాస్త కలకలం రేగింది. పోలీస్ స్టేషన్ ముందు వైఎస్సార్టీపీ శ్రేణులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించాయి. అనంతరం పోలీసులు షర్మిల రిమాండ్ కోసం ప్రయత్నించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని షర్మిల, ఆమెతోపాటు అరెస్ట్ అయిన ఆరుగురికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ నాంపల్లి కోర్టుకి విన్నవించారు. అయితే షర్మిల తరపు న్యాయవాదులు మాత్రం తమ క్ల‌యింట్లు శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేసేందుకే వెళ్లారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయలేదని వివరించారు. చివరకు కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై వారికి బెయిల్‌ మంజూరు చేసింది.

వైఎస్ షర్మిలతో పాటు మరో ఆరుగురిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పంజగుట్ట ఎస్సై అఖిల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రాష్ డ్రైవింగ్ తోపాటు, తమ వాహనాన్ని ఢీకొట్టేందుకు వేగంగా ముందుకొచ్చారని, ఎస్సై వీడియో చిత్రీకరిస్తుండగా సెల్ ఫోన్ లాక్కొని విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు పెట్టారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు షర్మిలతోపాటు మిగిలినవారిని కూడా కోర్టుకి హాజరు పరిచి రిమాండ్ కోరారు. అయితే కోర్టులో వారికి బెయిల్‌ లభించింది. అటు షర్మిల అరెస్ట్ తో లోటల్ పాండ్ లో నిరసన చేపట్టిన వైఎస్ విజయమ్మ తన దీక్ష విరమించారు.

First Published:  30 Nov 2022 1:16 AM GMT
Next Story