Telugu Global
Telangana

రేపటి నుంచి నుమాయిష్.. ముస్తాబైన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్

Hyderabad Numaish 2023: గాంధీభవన్ మెట్రో స్టేషన్‌ను ఆనుకొనే నాంపల్లి ఎగ్జిబిషన్ గేటు ఉండటంతో ఎక్కువగా మెట్రోను ఆశ్రయించే అవకాశం ఉన్నది.

రేపటి నుంచి నుమాయిష్.. ముస్తాబైన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్
X

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటే ఎవరికీ త్వరగా గుర్తుకు రాదు. అదే నుమాయిష్ లేదా నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే వెంటనే గుర్తు పడతారు. గత తొమ్మిది దశాబ్దాలుగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఈ ఎగ్జిబిషన్ ఈ ఏడాది కూడా జనవరి 1 నుంచి 46 రోజుల పాటు కొనసాగనున్నది. 83వ నుమాయిష్‌కు ఎగ్జిబిషన్ సొసైటీ, తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2019 ఎగ్జిబిషన్ సమయంలో అగ్నిప్రమాదం కూడా చోటు చేసుకోవడంతో పాటు, కరోనా కారణంగా గత రెండేళ్లుగా నుమాయిష్ నిర్వహించలేదు. దీంతో ఈ సారి ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.

జనవరి 1న నుమాయిష్‌ను తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక ప్రతీ రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ సారి నుమాయిష్‌లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 1500 మంది ఎగ్జిబిటర్లు 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుంచి ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దుస్తులు, ఫర్నీచర్, వంట సామాగ్రి, టాయ్స్‌తో పాటు అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి.

టికెట్ ధర ఎంతంటే?

ఇప్పటికే నాంపల్లి గ్రౌండ్స్‌ను అందంగా తీర్చి దిద్దారు. అందమైన విద్యుత్ లైట్లు, రంగుల బల్బులతో గ్రౌండ్ ముస్తాబైంది. ఇక్కడ కేవలం వస్తువులే కాకుండా రుచికరమైన ఆహారం, పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ వంటివి కూడా ఉన్నాయి. ఎగ్జిబిషన్ కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసింది. ఇక మెట్రో కూడా ఎగ్జిబిషన్ కోసం వచ్చే సందర్శకుల కోసం రాత్రి 11 గంటల వరకు రైళ్లు నడపనున్నది. గాంధీభవన్ మెట్రో స్టేషన్‌ను ఆనుకొనే నాంపల్లి ఎగ్జిబిషన్ గేటు ఉండటంతో ఎక్కువగా మెట్రోను ఆశ్రయించే అవకాశం ఉన్నది. ఈ ఏడాది ఎంట్రీ టికెట్ రూ.40గా నిర్వాహకులు ఫిక్స్ చేశారు.

First Published:  31 Dec 2022 12:10 PM GMT
Next Story