Telugu Global
Telangana

పట్టు భిగిస్తున్న టీఆర్ఎస్.. పుంజుకుంటున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని తొలుత భావించారు. కానీ అనుకోకుండా ఫామ్‌హౌస్ ఘటన కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చింది.

పట్టు భిగిస్తున్న టీఆర్ఎస్.. పుంజుకుంటున్న కాంగ్రెస్
X

మునుగోడు ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఒక విధంగా టీఆర్ఎస్, బీజేపీ పోరులో కాంగ్రెస్ కాస్త వెనకబడింది. కానీ మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటన కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. బీజేపీ నేతలు ప్రచారంలో మొఖం చాటేయడం.. నియోజకవర్గంలో పార్టీ బేరసారాలుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో రాజగోపాల్ రెడ్డి సింగిల్ అయిపోయారు. ఈ మూడు రోజులు రాజగోపాల్ రెడ్డి తన సొంత బలం, బలగంతోనే ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని తొలుత భావించారు. కానీ అనుకోకుండా ఫామ్‌హౌస్ ఘటన కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చింది. ఇప్పటికే మునుగోడులో ఆరు సార్లు గెలిచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉన్నది. పైగా పాల్వాయి స్రవంతి అక్కడి ప్రజలకు సుపరిచితురాలే. మొదట్లో ప్రచారానికి స్రవంతి ఇబ్బందులు పడింది. కానీ వారం రోజుల నుంచి ఆమె ప్రచారాన్ని ఉధృతం చేసింది. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకులు పాల్గొంటున్నా.. కొంత మంది మునుగోడుపై దృష్టి పెట్టారు.

ఇప్పటికే నియోజకవర్గం మొత్తం చుట్టేసిన స్రవంతి.. బూత్ కార్యకర్తలపై దృష్టి పెట్టారు. వారితో సమావేశాలు నిర్వహిస్తూ.. కాంగ్రెస్‌కు సాంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకును పోగొట్టుకోకుండా వ్యూహం రచిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు కూడా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శంషాబాద్‌లో రాహుల్ సభ తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. గత రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పార్టీకి మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరిగిందని నాయకులు అంటున్నారు. తమకు టీఆర్ఎస్‌తోనే పోటీ అని చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే గత రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకున్నట్లే కనపడుతోంది.

టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికను మొదటి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. తమ సిట్టింగ్ స్థానం కాకపోయినా.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తూ టీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. వాటన్నింటినీ టీఆర్ఎస్ తిప్పి కొట్టింది. లెక్కలతో సహా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాల గురించి వివరించింది. ఇక్కడ గెలవాలనే లక్ష్యంతో మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. వారందరూ తమ శక్తికొలది ప్రచారం చేశారు.

టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయడం.. మంత్రులు రోడ్ షోలతో పార్టీకి మద్దతు పెరిగింది. బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను కూడా ప్రజలకు విడమర్చి చెప్పడంలో సఫలం అయ్యారు. దీనికి తోడు ఫామ్‌హౌస్ ఘటన ద్వారా టీఆర్ఎస్‌పై బీజేపీ ఎలా దాడి చేస్తోందో ప్రజలకు కూడా తెలిసింది. దీనికి తోడు సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. చండూరు మండలం బంగారిగడ్డలో ఆదివారం జరిగే సభ తర్వాత టీఆర్ఎస్ మరింతగా పుంజుకుంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే 100 మంది ఓటర్లకు ఒక ఇంచార్జిని నియమించి ఓట్లు చీలకుండా టీఆర్ఎస్ గట్టి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంచార్జిలు ఓటర్లను నిత్యం కలుస్తూ పార్టీకే ఓటు వేయించేలా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ టీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశాలే.

మరోవైపు ఈ నియోజకవర్గంలో భారీ ఓటు బ్యాంకు ఉన్న వామపక్షాలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. కేవలం అధికార పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతోనే ఆగిపోకుండా.. వామపక్ష నాయకులు స్వయంగా రంగంలోకి దిగి టీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారు. చాలా గ్రామాల్లో సీపీఎం, సీపీఐ నాయకులు ఉపసర్పంచ్, స్కూల్ కమిటీ చైర్మన్ పదవులు కలిగి ఉన్నారు. వారంతా టీఆర్ఎస్‌కే ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఇది తప్పకుండా టీఆర్ఎస్‌కు అదనపు బలమే.

ఎటు తిరిగి ఈ ఉపఎన్నిక రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవాన్ని మిగిల్చనున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తన గెలుపుపై ధీమాగా కనిపించిన రాజగోపాల్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం రాజగోపాల్ రెడ్డిపై పడింది. తాను కూడా బీజేపీకి అమ్ముడు పోయానని ప్రజలకు స్పష్టంగా అర్థం అయిపోయింది. ఎంత డబ్బైనా పెట్టి గెలవాలని భావిస్తున్న రాజగోపాల్‌కు బీజేపీ కుట్రలు పెద్ద అడ్డంకిగా మారాయి. పైగా నడ్డా తన సభను రద్దు చేసుకోవడం కూడా రాజగోపాల్‌కు మైనస్ అని చెప్పవచ్చు. గత రెండు రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మునుగోడు వైపు ప్రచారానికి రావడం లేదు. దీంతో కార్యకర్తలు కూడా డీలా పడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడుగా ప్రచారంలో దూసుకొని పోతుంటే.. బీజేపీ మాత్రం నిరుత్సాహంలో కూరుకొని పోయింది. మొత్తానికి త్రిముఖ పోరు కాస్తా.. ఇప్పుడు ద్విముఖ పోరులా మారింది. ఇదంతా బీజేపీ స్వయంకృతాపరాధమే.

First Published:  29 Oct 2022 4:22 AM GMT
Next Story