Telugu Global
Telangana

మునుగోడుపై బీజేపీ అధిష్టానం అసంతృప్తి.. ఢిల్లీకి బండి..

క్షుద్ర పూజలంటూ జరిగిన ప్రచారంలో కూడా బీజేపీ అట్టర్ ఫ్లాప్ కావడంతోపాటు, ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో బండిని ఢిల్లీకి పిలిపించి చీవాట్లు పెట్టబోతున్నారని సమాచారం.

మునుగోడుపై బీజేపీ అధిష్టానం అసంతృప్తి.. ఢిల్లీకి బండి..
X


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం విషయంలో బీజేపీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం ఆయన అమిత్ షా ని కలవబోతున్నారు. మునుగోడు ప్రచారంలో బీజేపీ వెనకబడటం, 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ విషయంలో ఆరోపణలను తిప్పికొట్టలేకపోవడంపై చర్చ జరిగే అవకాశముంది. క్షుద్ర పూజలంటూ జరిగిన ప్రచారంలో కూడా బీజేపీ అట్టర్ ఫ్లాప్ కావడంతోపాటు, ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో బండిని ఢిల్లీకి పిలిపించి చీవాట్లు పెట్టబోతున్నారని సమాచారం.

వాస్తవానికి మరికొన్నిరోజుల్లో అమిత్ షా మునుగోడుకు రాబోతున్నారు. మరికొంతమంది కేంద్ర మంత్రులు, కీలక నేతలు కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి తరపున ప్రచారం చేస్తారు. ఈ దశలో వ్యూహ రచన హైదరాబాద్ లోనే జరుగుతుందని అనుకున్నారంతా, కానీ సడన్ గా బండికి హస్తిన నుంచి పిలుపొచ్చింది. దీంతో అసలు సంగతి ఏమై ఉంటుందా అనే ఆరా మొదలైంది. రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ పూర్తిగా డ్యామేజీ అవుతున్న క్రమంలో నష్టనివారణ చర్యలపై బీజేపీ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

కాంట్రాక్ట్ లతో ఇబ్బందులు..

18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు వచ్చాయంటూ టీవీ డిబేట్ లో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంకా హాట్ టాపిక్ గానే ఉన్నాయి. వాటినుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలితం లేకుండా పోయింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంట్రాక్ట్ సొమ్ములే కీలకం అని తేలిపోయింది. దీంతో అభ్యర్థికి నష్టం, దాంతోపాటు.. పార్టీకి తీరని కష్టం. అందుకే బీజేపీ హడావిడి పడుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు బండిని పిలిపించింది. అదే సమయంలో ఆయనకు అక్షింతలు కూడా వేస్తారని సమాచారం. అందుకే ఆయన్ని వ్యక్తిగతంగా ఢిల్లీకి పిలిపించారని అంటున్నారు.

First Published:  12 Oct 2022 3:43 PM GMT
Next Story