Telugu Global
Telangana

'కేసీఆర్‌ను మరిచిపోయే పరిస్థితి లేదు.. ఎవరో వచ్చి పైసల ఆశ పెడ్తే నమ్మెటోళ్లు లేరు'

ఓ వ్యక్తి నుంచి వచ్చిన మాటలు మంత్రితో సహా అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకుల్లో ఉత్సాహం నింపాయి. పాశం శివారెడ్డి అనే వ్యక్తి తనకు, తన గ్రామానికి కేసీఆర్ ప్రభుత్వం ఏమేం చేసిందో ఏకరవు పెట్టారు.

కేసీఆర్‌ను మరిచిపోయే పరిస్థితి లేదు.. ఎవరో వచ్చి పైసల ఆశ పెడ్తే నమ్మెటోళ్లు లేరు
X

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు బిజీగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీఎస్పీ, టీజేఎస్, టీడీపీ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యాయి. రాజకీయ నాయకులు ఊరురా తిరుగుతూ ఓటర్లను తమ పార్టీకే ఓటేయమని వేడుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులోనే క్యాంప్ వేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి పలు రకాల స్పందనలు వస్తున్నాయి. తాజాగా మంత్రి యర్రబెల్లి దయాకర్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలోకి దిగారు. చండూరులోని 2, 3వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.

డప్పుల దరువుల మధ్య ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మమేకం అయ్యారు. స్థానిక నాయకులు ఆయన వెంట రాగా.. పాలకుర్తి నుంచి కూడా వచ్చిన అనుచరులతో కలసి ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పథకాలు అందుతున్నాయా? పని తీరు ఎలా ఉందంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి నుంచి వచ్చిన మాటలు మంత్రితో సహా అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకుల్లో ఉత్సాహం నింపాయి. పాశం శివారెడ్డి అనే వ్యక్తి తనకు, తన గ్రామానికి కేసీఆర్ ప్రభుత్వం ఏమేం చేసిందో ఏకరవు పెట్టారు.

'మాకు కరెంట్ బాధ లేదు. నెల నెలా పెన్షన్లు వస్తున్నాయి. గతంలో నీటి కోసం ఇబ్బంది పడేవాళ్లం. ఊరిలో గొడవలు కూడా అయ్యేవి. కానీ ఇప్పుడు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఉన్నది. మీరు అసలు బాధ పడొద్దు. కేసీఆర్‌ను ప్రజలు మరిచిపోయే పరిస్థితే లేదు. రాబోయే ఎన్నికలో ఫుల్లు మెజార్టీ వస్తుంది. ఎవరో ఒకరిద్దరి చిల్లర ఓట్లు వేరే వాళ్లకు పోతాయేమో. కానీ టీఆర్ఎస్‌ మాత్రమే గెలుస్తుంది. రాసి పెట్టుకోండి. కొందరు మధ్యలో వచ్చి కెళ్లకిచ్చి పోతున్నారు. పైసల ఆశ పెడుతున్నారు. కానీ నమ్మేటోళ్లు ఎవరూ లేరు. కేసీఆర్ అసలు మాకు ఏమీ తక్కువ చేయలేదు. రైతు బంధు కూడా వస్తున్నది. ఒకరిద్దరు పిచ్చి పిచ్చిగా మాట్లాడతున్నరు. వాళ్లు తప్పకుండా ఆలోచన చేసుకోవాలి. తప్పుడు తోవలో పోతే వారికే ఇబ్బంది అవుతుంది' అని మంత్రితో శివారెడ్డి అన్నారు.

శివారెడ్డి ఏకధాటిగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపిస్తుంటే మంత్రితో సాహా అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఆసక్తిగా విన్నారు. చివరకు జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు చేసుకుంటూ అక్కడి నుంచి ప్రచారంలో ముందుకు కదిలారు.



First Published:  13 Oct 2022 12:51 PM GMT
Next Story