Telugu Global
Telangana

మునుగోడు బ‌రిలో తెలంగాణ టీడీపీ అభ్య‌ర్థి..

జ‌క్క‌లి ఐల‌య్య యాద‌వ్‌ను త‌మ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిగా ఖ‌రారు చేశారు. గురువారం నాడు అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు.

Munugode TDP Candidate
X

మునుగోడు ఉప ఎన్నిక విష‌యంలో త‌మ పాత్ర‌పై ఇప్ప‌టివ‌ర‌కు మ‌ల్ల‌గుల్లాలు ప‌డిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలో త‌మ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని నిలిపేందుకు నిర్ణ‌యించారు. జ‌క్క‌లి ఐల‌య్య యాద‌వ్‌ను త‌మ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిగా ఖ‌రారు చేశారు. గురువారం నాడు అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు.

తెలంగాణ‌లో మునుగోడు ఉప ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టికే పొలిటిక‌ల్ హీట్ ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే. ప్ర‌ధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష‌ బీజేపీ, కాంగ్రెస్ ల మ‌ధ్యే ఈ వార్ కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు.. మిరియాలు నూరుకుంటున్నారు. విమ‌ర్శ‌ల బాణాలు సంధించుకుంటున్నారు.

ఈ త‌రుణంలో తెలంగాణ‌లో త‌న ప్రాభ‌వం పూర్తిగా త‌గ్గిపోయిన‌ తెలుగుదేశం పార్టీ కిమ్మ‌న‌కుండా ఉండాలా లేక పోటీలో నిల‌వాలా లేదా ఏదైనా పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాలా అని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డింది. తాజాగా నోటిఫికేష‌న్ వ‌చ్చి.. నామినేష‌న్ల ప‌ర్వం మొద‌లైపోవ‌డంతో త‌మ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని బ‌రిలో నిలపాల‌ని నిర్ణ‌యించింది.

బ‌రిలో నిలిచినా.. త‌మ‌కు బ‌లం లేని తెలంగాణ‌లో త‌మ‌కు డిపాజిట్లు కూడా ద‌క్కే అవ‌కాశం లేద‌ని తెలిసినా.. టీడీపీ బ‌రిలో నిలిచేందుకు ఎందుకు నిర్ణ‌యించిందనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీసీకి అభ్య‌ర్థిత్వం ఇవ్వ‌డం ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీసీల ప‌ట్ల తాము సానుకూలంగా ఉన్నామ‌నే అభిప్రాయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని బీసీ వ‌ర్గాల‌కు చేరేలా చేయ‌వ‌చ్చ‌ని ఆ పార్టీ ఆలోచ‌న‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

First Published:  12 Oct 2022 12:15 PM GMT
Next Story