Telugu Global
Telangana

కేఏ పాల్‌కు 'ఉంగరం'.. టీఆర్ఎస్ వ్యతిరేకించిన 'రోడ్ రోలర్' మరొకరికి..

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఉంగరం గుర్తును కేటాయించారు. ట్రక్కు, ట్రాక్టర్ గుర్తులను ఎవరికీ కేటాయించలేదు.

కేఏ పాల్‌కు ఉంగరం.. టీఆర్ఎస్ వ్యతిరేకించిన రోడ్ రోలర్ మరొకరికి..
X

మునుగోడు ఉపఎన్నికకు సంబందించి నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం (అక్టోబర్ 17)తో ముగిసింది. ఈ ఉపఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో 47 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చివరి రోజు 36 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో చివరికి 47 మంది బరిలో నిలిచారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు గుర్తింపు పొందిన పార్టీలు కావడంతో వారికి గుర్తులు ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం లేదు. కాగా, మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు సోమవారం రాత్రి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి జగన్నాథ్ రావు పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఈ గుర్తులు కేటాయించారు.

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఉంగరం గుర్తును కేటాయించారు. ట్రక్కు, ట్రాక్టర్ గుర్తులను ఎవరికీ కేటాయించలేదు. కానీ రోడ్ రోలర్ గుర్తును మాత్రం ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చారు. ఈ గుర్తు కావాలని ముగ్గురు అభ్యర్థులు కోరగా.. లాటరీ పద్దతిలో యుగతులసి పార్టీ నుంచి నామినేషన్ వేసిన శివకుమార్ కొలిశెట్టికి ఈ గుర్తు కేటాయించినట్లు తెలుస్తున్నది. కాగా, కారు గుర్తును పోలిన కెమేరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు బాక్స్, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈసీకి లేఖ రాసింది. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది.

శనివారం హౌస్ మోషన్ పిటిషన్ వేయగా.. సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేయమని సూచించారు. దీంతో సోమవారం టీఆర్ఎస్ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే అత్యవసర విచారణ జరపడానికి ధర్మాసనం నిరాకరించింది. నవంబర్ 3నే పోలింగ్ ఉన్నదని.. వెంటనే విచారించాలని విజ్ఞప్తి చేయడంతో మంగళవారం విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ వ్యతిరేకించిన రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంతో ఆందోళన నెలకొన్నది. ఒకవేళ హైకోర్టు ఆ గుర్తును కేటాయించవద్దని కోరితే యుగతులసి పార్టీ అభ్యర్థికి మరో గుర్తు కేటాయించే అవకాశం ఉన్నది.

47 మంది అభ్యర్థుల కోసం మూడు బ్యాలెట్ యూనిట్లు..

ఇక మునుగోడు ఉపఎన్నికలో మూడు బ్యాలెట్ యూనిట్లను వాడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్‌లో 16 మందికే చోటు ఉంటుందని.. బరిలో 47 మంది ఉండటంతో మూడు యూనిట్లు వాడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ బ్యాలెట్ యూనిట్‌లో అభ్యర్థుల పేరుతో పాటు గుర్తు, ఫొటో కూడా ఉంటుందని చెప్పారు. మూడు యూనిట్లకు కలిపి ఒకటే నోటా గుర్తు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఈవీఎంలతో సహా బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేస్తున్నామని.. ఎన్నికల సిబ్బందిని కూడా ఇప్పటికే ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

First Published:  18 Oct 2022 3:27 AM GMT
Next Story