Telugu Global
Telangana

మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు? ఈసీ ఏం చెప్తోంది?

ఏదైనా అసెంబ్లీ, కౌన్సిల్, లోక్‌సభ, రాజ్యసభ స్థానం ఖాళీ అయితే దానికి 6 నెలల లోపు ఎన్నిక నిర్వహించాలని రాజ్యాంగం చెప్తోంది. ఒకవేళ ఏడాది లోపే ఎన్నికలు ఉంటే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్‌దే.

మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు? ఈసీ ఏం చెప్తోంది?
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో అన్ని పార్టీలు ఇక్కడ ఉపఎన్నిక కోసం సిద్దమవుతున్నాయి. అయితే మునుగోడుకు అసలు ఉప ఎన్నిక జరుగుతుందా? ఎప్పుడు జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయనే విషయంపై చర్చ జరుగుతోంది.

ఏదైనా అసెంబ్లీ, కౌన్సిల్, లోక్‌సభ, రాజ్యసభ స్థానం ఖాళీ అయితే దానికి 6 నెలల లోపు ఎన్నిక నిర్వహించాలని రాజ్యాంగం చెప్తోంది. ఒకవేళ ఏడాది లోపే ఎన్నికలు ఉంటే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్‌దే. తెలంగాణ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడానికి ఏడాదికి పైగా సమయం ఉన్నది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక ఖాయం అని తెలుస్తున్నది.

రాజగోపాల్ రెడ్డి రెండు రోజుల్లో స్పీకర్‌కు రాజీనామా పంపిస్తానని చెప్పారు. ఆయన రాజీనామా కనుక ఆమోదం పొందితే.. అసెంబ్లీ కార్యదర్శి ఆ సమాచారాన్ని ఈసీకి పంపిస్తారు. అప్పుడు ఆ ఖాళీని ఈసీ నోటిఫై చేసి ఎలక్షన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది నవంబర్‌లో హిమాచల్‌ప్రదేశ్, డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి.

రాజగోపాల్ రెడ్డి ఖాళీ చేసిన మునుగోడు సీటును కనుక ఈసీ నోటిఫై చేస్తే.. నవంబర్ కానీ డిసెంబర్‌లో కానీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ అసెంబ్లీకి ఏడాది ముందు జరుగనున్న ఈ ఉపఎన్నిక కచ్చితంగా ఒక ప్రీఫైనల్ లాగా ఉండబోతున్నది. రాజకీయ పార్టీలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఉపఎన్నికపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

First Published:  3 Aug 2022 3:31 AM GMT
Next Story