Telugu Global
Telangana

మునుగోడులో సెకండ్ ప్లేస్ ఎవరిది..? పోలింగ్ కి ముందే ఆసక్తికర చర్చ

క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కే రెండో స్థానం అనే మాట బలంగా వినపడుతోంది. ప్రచారం సంగతి పక్కనపెడితే బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అదిప్పుడు మునుగోడులో స్పష్టంగా కనపడుతోంది.

మునుగోడులో సెకండ్ ప్లేస్ ఎవరిది..? పోలింగ్ కి ముందే ఆసక్తికర చర్చ
X

ఎన్నికలంటే విజేతపైనే అందరి దృష్టి ఉంటుంది. కానీ మునుగోడులో మాత్రం పరిస్థితి అలా లేదు. విజేత టీఆర్ఎస్ అని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారు ప్రజలు. నాయకులలో కూడా అదే అభిప్రాయం ఉంది. అయితే ఇక్కడ రెండో స్థానం ఎవరిది అనే విషయంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మునుగోడులో రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన రాజగోపాల్ రెడ్డి హడావిడి బాగా ఎక్కువగా ఉంది. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు చేజిక్కించుకున్న ఆయన, వెయ్యి కోట్లు ఖర్చుపెట్టైనా సరే ఈ ఉప ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని చూస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ రోజులు దగ్గరపడేకొద్దీ డబ్బులు పెట్టినా ఫలితం ఉండదని తేలిపోయింది. దీంతో డబ్బులు ఖర్చు చేయడం కూడా వృథా అనే పరిస్థితికి వచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఒకరకంగా అస్త్రసన్యాసం చేయబోతున్నారన్నమాట. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి భారీగా ఖర్చు చేసినా అది కేవలం రెండో స్థానం కోసమే.

Advertisement

2018లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి గెలిచారంటే అక్కడ ఆయన సొంత బలం కంటే కాంగ్రెస్ పార్టీ బలమే ఎక్కువ. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ సొంత బలం లేదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేరినా ఆ పార్టీకి ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ నుంచి ఎవరూ రాజగోపాల్ రెడ్డితోపాటు బయటకు రాలేదు. బీజేపీలోకి రాకపోగా కొంతమంది నాయకులు టీఆర్ఎస్ లో చేరడం విశేషం. అంటే కాంగ్రెస్ బలం తగ్గి అక్కడ టీఆర్ఎస్ బలం పెరిగిందన్నమాట.

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
Advertisement

మునుగోడులో రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి పార్టీని మోసం చేసినా కనీసం అక్కడ రెండో స్థానం దక్కించుకుంటే పరువు నిలుస్తుందనేది కాంగ్రెస్ భావన. బీజేపీది కూడా ఇదే ఆలోచన. మూడో స్థానంతో డిపాజిట్లు గల్లంతయితే ఆ ప్రభావం 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. అందుకే రెండో స్థానంతో అయినా సరిపెట్టుకోవాలని చూస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.

కాంగ్రెస్ దే రెండో స్థానం..

కానీ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కే రెండో స్థానం అన్నమాట బలంగా వినపడుతోంది. బీజేపీ నుంచి జాతీయ నాయకులెవరూ ప్రచారానికి రావట్లేదు. రాష్ట్ర నాయకులు కూడా అంటీముట్టనట్టుగా ఉన్నారు. ప్రచారం సంగతి పక్కనపెడితే బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అదిప్పుడు మునుగోడులో స్పష్టంగా కనపడుతోంది. నిత్యావసరాల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోవడంతో బీజేపీ పతనం ప్రారంభమైంది. ముఖ్యంగా తెలంగాణకు బీజేపీ ఏమీ చేయకపోవడం, ప్రత్యేకించి మునుగోడుకి ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చకపోవడంతో బీజేపీపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి, పాల్వాయి స్రవంతి కన్నీటి ఎపిసోడ్ తో కాంగ్రెస్ శ్రేణుల్లో కాస్తో కూస్తో సింపతీ పెరిగింది. ఇవన్నీ కాంగ్రెస్ కి కలిసొచ్చి ఆ పార్టీ రెండో స్థానంలో నిలబడటం ఖాయం అని అంటున్నారు.

రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతుంటే.. టీఆర్ఎస్ మాత్రం విజయంపై ధీమాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మునుగోడు నుంచి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టడం ఇవన్నీ టీఆర్ఎస్ కి అనుకూలం. మునుగోడుని దత్తత తీసుకుంటానంటూ ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనకి కూడా మంచి స్పందన వస్తోంది. పైగా చేరికలు టీఆర్ఎస్ బలాన్ని రెట్టింపు చేశాయి. దీంతో ఆ పార్టీ విజయంపై పూర్తి ధీమాగా ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా సెకండ్ ప్లేస్ దక్కితే చాలనుకుంటున్నారు.

Next Story