Telugu Global
Telangana

మునుగోడులో కండువాల పండగ

మునుగోడులో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, రేపు ఏ పార్టీలో చేరతారో అనేది ఊహలకు అందడంలేదు. అనుచరులు సైతం, తమ నాయకుడు పార్టీ మారాడనే విషయాన్ని టీవీల్లోనో, సోషల్ మీడియాలో చూసి తెలుసుకునే పరిస్థితి ఉంది.

మునుగోడులో కండువాల పండగ
X

మునుగోడు ఉప ఎన్నికకు కారణం పార్టీ ఫిరాయింపు. కాంట్రాక్ట్ సొమ్ములకు ఆశపడిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ని వదిలి బీజేపీలో చేరాలనుకోవడం వల్లే ఈ ఉప ఎన్నికలొచ్చాయనేది వైరివర్గాల ప్రధాన ఆరోపణ. అలా ఫిరాయింపులతో మొదలైన ఉప ఎన్నిక, పోలింగ్ రోజు కూడా ఫిరాయింపులతోనే ముగిసేలా కనిపిస్తోంది. మునుగోడులో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, రేపు ఏపార్టీలో చేరతారో అనేది ఊహలకు అందడంలేదు. కొన్నిసార్లు ప్రధాన అనుచరులు సైతం, తమ నాయకుడు పార్టీమారాడనే విషయాన్ని టీవీల్లోనో, సోషల్ మీడియాలో చూసి తెలుసుకునే పరిస్థితి ఉంది.

బూర అలా, పల్లె ఇలా..

చోటా మోటా నాయకుల సంగతి పక్కనపెడితే, కీలక నేతలు కూడా చొక్కా మార్చుకున్నంత ఈజీగా పార్టీ మార్చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి బీఫామ్ ఇచ్చే రోజు నేరుగా సీఎం కేసీఆర్ ని కలసి సంఘీఘావం తెలిపి, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, రెండు రోజుల్లోనే ప్లేటు ఫిరాయించారు. టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న పల్లె రవికుమార్‌ గౌడ్, ఆయన సతీమణి చండూరు ఎంపీపీ కల్యాణి.. మరుసటి రోజే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

టీఆర్ఎస్ దూకుడు, కాంగ్రెస్ డీలా..

చేరికల విషయంలో టీఆర్ఎస్ దూకుడుతో వెళ్తోంది. బీజేపీ బుట్టలో పడ్డట్టే ఉన్నా చాలామందికి చివరి నిముషంలో జ్ఞానోదయం అవుతోంది. ఇక కాంగ్రెస్ మాత్రం చేరికల విషయంలో డీలా పడింది. ఔట్ గోయింగే కానీ, ఇన్ కమింగ్ కాంగ్రెస్ కి లేకపోవడం గమనార్హం.

మళ్లీ.. మళ్లీ..

కొంతమంది నేతలు మళ్లీ మళ్లీ పార్టీ మారడం ఇక్కడ గమనార్హం. చండూరు జడ్పీటీసీగా కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కర్నాటి వెంకటేశం మొత్తం మూడు పార్టీలు మారారు. జడ్పీటీసీగా గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్‌ లోకి వెళ్లిన ఆయన, ఇటీవల బీజేపీలో చేరారు. అక్కడ ఎక్కువరోజులు ఇమడలేకపోయారు. రెండు రోజులకే తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. గట్టుప్పల్‌ ఎంపీటీసీ కూడా చండూరు జడ్పీటీసీతో కలిసి టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి సమక్షంలో తిరిగి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇలా అటు ఇటు, ఎటో తేల్చుకోలేక సతమతం అవుతున్నవారు చాలామందే ఉన్నారు. వీరంతా ఏ గట్టున ఉంటారో ఎన్నికలు పూర్తయ్యాకే ఓ క్లారిటీ వస్తుంది.

First Published:  16 Oct 2022 2:01 AM GMT
Next Story