Telugu Global
Telangana

అనారోగ్యం పేరు చెప్పి ప్రచారానికి దూరం కానున్న రాజగోపాల్..

ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వంతు. రాజగోపాల్ రెడ్డి కూడా రెండు మూడు రోజులపాటు అనారోగ్యం డ్రామా ఆడి, ఆ తర్వాత సింపతీకోసం ప్ర‌జ‌ల్లోకి వస్తారన్న‌మాట.

అనారోగ్యం పేరు చెప్పి ప్రచారానికి దూరం కానున్న రాజగోపాల్..
X

మునుగోడు ఉప ఎన్నిక. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందుగా జరుగుతున్న ప్రతిష్టాత్మక పోరు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. మూడు పార్టీలు ఎంతో నమ్మకంతో బరిలో దిగాయి. కానీ ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ బీజేపీ నీరసపడింది, కాంగ్రెస్ కాస్త డల్లయింది, టీఆర్ఎస్ లో జోష్ పెరిగింది. సర్వేలు చెప్పే వివరాలు కావివి. ప్రచార పర్వాన్ని జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే వాస్తవాలు. అవును, మునుగోడు ప్రచార పర్వాన్ని పరిశీలిస్తే బీజేపీ ఎలా చేతులెత్తేసిందో ఈజీగా అర్థమవుతుంది.

రాజగోపాల్ రెడ్డికి అనారోగ్యం..!

అదేంటి, ప్రచారంలో హుషారుగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి అనారోగ్యం ఏంటి అనుకుంటున్నారా, మరో రెండురోజుల్లో ఇదే అధికారిక ప్రకటన అవుతుందని అనుమానిస్తున్నాయి వైరి వర్గాలు. ఓటమి భయంతో రాజగోపాల్ రెడ్డి ప్రచార పర్వానికి దూరంగా ఉండాలనుకుంటున్నారట. కొన్నిచోట్ల ప్రజలు తరిమి తరిమి కొడుతుండే సరికి ప్రచారానికి వెళ్లేందుకు వెనకాడాల్సిన పరిస్థితి. ఓటమిని ఒప్పుకుంటే సిగ్గుచేటు, అందుకే అనారోగ్యం నాటకం. తనకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే ప్రచారానికి రాలేకపోతున్నానంటూ రెండుమూడు రోజుల్లో రాజగోపాల్ రెడ్డి ప్రకటించబోతున్నారని మునుగోడులో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరితే సింపతీ వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయ, ఒకవేళ ఓడిపోతే.. ప్రచారానికి రాలేకపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా రెండు విధాలుగా ఆలోచించి రాజగోపాల్ రెడ్డి సరికొత్త నాటకానికి తెరతీయబోతున్నారని అంటున్నారు.

అందరూ అందరే..

దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాల్లాగే మునుగోడు కూడా తమ పరపతి పెంచుతుందని అనుకున్న బీజేపీ నేతలకు వాస్తవం బోధపడటానికి పెద్దగా సమయం పట్టలేదు. ఆ కారణంతోనే ఒక్కొక్కరూ ప్రచారానికి దూరమవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు ముందుగానే చేతులెత్తేశారు. రాజగోపాల్ రెడ్డికి కండువా కప్పేందుకు వచ్చిన అమిత్ షా, ఆ తర్వాత ఇటువైపు చూడలేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండానే గుజరాత్ కి 12సార్లు వెళ్లొచ్చిన మోదీ, కనీసం మునుగోడుపై ఓ స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. సీనియర్లు, కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలు.. ఎవరూ ప్రచారానికి రావట్లేదు. ఇక రాష్ట్ర నాయకత్వం కూడా దాదాపుగా మునుగోడుకి దూరంగానే ఉంటోంది.

బండి సంజయ్, ఢిల్లీ వెళ్లి రోడ్ మ్యాప్ తో వస్తారనుకుంటే, తీరా వచ్చి ఇంటికెళ్లారు కానీ మునుగోడు ప్రచారానికి రాలేదు. వచ్చినా సాయంత్రం వేళ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఒకరోజు వస్తే, రెండురోజులు రెస్ట్.. ఇలా ఉంది ఆయన పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చేతిగాయం సాకు చెప్పి మునుగోడుకి దూరంగా ఉంటున్నారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన సైంటిస్ట్ మోదీ, మునుగోడు పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యేనంటూ ఆయన నోరు జారడం బీజేపీకి తలనొప్పిగా మారింది. ఒకరకంగా కిషన్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటమే ఆ పార్టీకి మేలు అనుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ జైలులో కాలక్షేపం చేస్తున్నారు. ఈటల రాజేందర్ తొలినాళ్లలో చేసిన హడావిడి ఇప్పుడు కనిపించడంలేదు. రఘునందన్ రావు కూడా అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. చెప్పుకోదగ్గ నాయకులెవరూ మునుగోడులో బీజేపీ తరపున ప్రచారం చేయట్లేదు. కొత్తగా వచ్చిన బూర నర్సయ్య గౌడ్ కి కూడా మునుగోడు వాసులు చుక్కలు చూపెట్టడంతో ఆయన పలాయనం చిత్తగించారు. బహుశా మరోసారి ఆయన ప్రచారానికి వచ్చే సాహసం చేయకపోవచ్చు.

పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక తాను మాత్రం ప్రచారానికి వెళ్లి ఇరగదీసేదేముంది అని భావిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రజల దగ్గర చీవాట్లు, చీత్కరింపులు తప్పవని డిసైడ్ అయిన ఆయన అనారోగ్యం సాకుతో కొన్నిరోజులు ప్రచారానికి దూరం కాబోతునారు. ఆ తర్వాత కట్టుకట్టుకునో, వీల్ చైర్లో కూర్చునో సానుభూతికోసం బయటకొస్తారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల వేళ రఘునందన్ రావు ఇలాగే చేతికి కట్టు కట్టుకుని వచ్చారు, హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ ఈటల రాజేందర్ కూడా ఆస్పత్రిలో చేరి సింపతీ డ్రామా ఆడారు. ఇక బండి సంజ‌య్ ఆస్ప‌త్రి ప‌ర్వం స‌రేస‌రి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వంతు. రాజగోపాల్ రెడ్డి కూడా రెండు మూడు రోజులపాటు అనారోగ్యం డ్రామా ఆడి, ఆ తర్వాత సింపతీకోసం తెరపైకి వస్తారన్న‌మాట.

ఇక మునుగోడు ప్రచారంలో ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్తోంది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇప్పటి వరకూ మునుగోడుకి ఏం చేశామో చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. బీజేపీని ఎండగడుతూ, కాంగ్రెస్ నిస్సహాయ స్థితిని ప్రజలకు వివరిస్తూ.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తున్నారు.

First Published:  22 Oct 2022 11:25 AM GMT
Next Story