Telugu Global
Telangana

రాజాసింగ్‌కు సొంత పార్టీలోనే పోటీ.. గోషామ‌హ‌ల్ టికెట్‌కు ముఖేష్ త‌న‌యుడి అర్జీ

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో గోషామ‌హ‌ల్‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి రాజాసింగ్ చేతిలో ఓట‌మి పాలైన ముఖేష్ గౌడ్ 1989 నుంచి ఆరుసార్లు ఈ నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేశారు

రాజాసింగ్‌కు సొంత పార్టీలోనే పోటీ.. గోషామ‌హ‌ల్ టికెట్‌కు ముఖేష్  త‌న‌యుడి అర్జీ
X

బీజేపీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ వ్య‌వ‌హారం ఇంకా తేల‌లేదు. ఇంత‌లోనే బీజేపీలో గోషామ‌హ‌ల్ సీట్‌కు పోటీ పెరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ త‌న‌యుడు విక్ర‌మ్ గౌడ్ గోషామ‌హ‌ల్ బీజేపీ టికెటివ్వాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ టికెట్ ఎవ‌రికి ఇస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

1989 నుంచి ముఖేష్ గౌడ్ పోటీ

2004 వ‌రకు ఈ నియోజ‌క‌వ‌ర్గం మ‌హ‌రాజ్‌గంజ్‌గా ఉండేది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో గోషామ‌హ‌ల్‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి రాజాసింగ్ చేతిలో ఓట‌మి పాలైన ముఖేష్ గౌడ్ 1989 నుంచి ఆరుసార్లు ఈ నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేశారు. మూడు సార్లు గెలిచి, మూడుసార్లు ఓడిపోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాల్లో మంత్రిగా ప‌ని చేశారు. దాదాపు 40 ఏళ్లుగా ఈ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో అత్యంత కీల‌క నేత‌గా ఉన్న ముఖేష్ గౌడ్ 2019లో చ‌నిపోయారు. త‌ర్వాత ఆయ‌న కుమారుడు విక్ర‌మ్‌గౌడ్ బీజేపీలో చేరారు. త‌న తండ్రి ప్రాతినిధ్యం వ‌హించిన గోషామ‌హ‌ల్ నుంచి టికెటివ్వాల‌ని అప్ల‌య్ చేసుకున్నారు.

తానే పోటీ చేస్తానంటున్న రాజాసింగ్

రాష్ట్రంలో 115 స్థానాల‌కు టికెట్లు ప్ర‌క‌టించిన అధికార బీఆర్ఎస్ పెండింగ్‌లో పెట్టిన 4 టికెట్ల‌లో గోషామ‌హ‌ల్ కూడా ఒక‌టి. బీజేపీ నుంచి స‌స్పెండ్ అయిన రాజాసింగ్ బీఆర్ఎస్‌లోకి వ‌స్తార‌ని.. అందుకే ఈ టికెట్ పెండింగ్ పెట్టార‌ని ప్ర‌చారం న‌డిచింది. అయితే దీన్ని రాజాసింగ్ ఖండించారు. బీజేపీయే త‌న పార్టీ అని, వేరే పార్టీలోకి వెళ్లేది లేద‌ని తేల్చిచెప్పారు. రాజాసింగ్‌15 రోజుల కింద‌ట ఉత్త‌రప్ర‌దేశ్ మాజీ సీఎం క‌ళ్యాణ్‌సింగ్ వ‌ర్థంతి స‌భ‌కు యూపీకి వెళ్లి అక్క‌డ పార్టీ అధ్య‌క్షుడు న‌డ్డాను క‌లిసి, స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌పై హామీ పొందార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే బీజేపీ టికెట్ రాజాసింగ్‌కు ఇస్తారా.. యువ‌కుడైన విక్ర‌మ్‌ గౌడ్‌ను తెర‌పైకి తెస్తారా అనేది చూడాలి.

First Published:  7 Sep 2023 3:37 AM GMT
Next Story