Telugu Global
Telangana

మా ఓట్లు బీఆర్ఎస్ కే.. ముదిరాజ్ మహాసభ తీర్మానం

ముది రాజ్‌ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ మరింత పాటుపడుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు నేతలు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీకి ముదిరాజ్‌ సమాజం అండగా నిలవాలని సంకల్పించామని చెప్పారు.

మా ఓట్లు బీఆర్ఎస్ కే.. ముదిరాజ్ మహాసభ తీర్మానం
X

తెలంగాణలో తమ సామాజిక వర్గం బీఆర్ఎస్ కే మద్దతు తెలుపుతుందని ముదిరాజ్ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈమేరకు ముదిరాజ్‌ మహాసభ విద్యావంతుల వేదిక నేతలు బీఆర్ఎస్ కే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. స్వాతంత్రం తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి ముదిరాజ్‌ లను పట్టించుకోలేదని, ఉద్యమ నేత కేసీఆర్‌ సీఎం అయ్యాక ముదిరాజ్‌ ల అభ్యున్నతికి కృషి చేశారని వారు కొనియాడారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు నింపి ఉచితంగా రొయ్యలు, చేపలను వదిలి మత్స్యకారులందరినీ ఆదుకున్నారని చెప్పారు.




టికెట్ల కేటాయింపులో ముదిరాజ్ లకు న్యాయం చేయలేదని బీఆర్ఎస్ పై వైరి వర్గాలు విమర్శలు చేసినా.. ఆ సామాజిక వర్గం మాత్రం తమ మద్దతు కేసీఆర్ కే నంటోంది. ముదిరాజ్ లకు నామినేటెడ్ పోస్ట్ లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా ఈ విషయంలో సీఎం కేసీఆర్ పై భరోసాతో బీఆర్ఎస్ లో చేరారు. బిత్తిరి సత్తి కూడా సీఎం కేసీఆర్ తోనే ముదిరాజ్ లకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎన్నికల వేళ దాదాపుగా ముదిరాజ్ కీలక నేతలంతా బీఆర్ఎస్ కే జై కొట్టారు. ఈటల రాజేందర్.. తాను ముదిరాజ్ బిడ్డను అని చెప్పుకుంటున్నా కూడా, ఆయన అగ్రకులాల అల్లుడు కావడం, పిల్లల విషయంలో కూడా ఆ ఆధిపత్య ధోరణిని సూచించేలా పేర్లు పెట్టుకోవడంతో ఆయనను నిఖార్సయిన ముదిరాజ్ నాయకుడిగా ఆ సమాజం గుర్తించడంలేదు.

2014లో బీఆర్ఎస్ ముదిరాజ్ నేతలకు మంత్రి పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు మహాసభ నేతలు. తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు డాక్టర్‌ బండ ప్రకాష్ ను రాజ్యసభకు పంపారని, నేడు ఆయనను శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ గా నియమించి సమున్నతస్థానం కల్పించారని చెప్పారు. ముది రాజ్‌ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ మరింత పాటుపడుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు నేతలు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీకి ముదిరాజ్‌ సమాజం అండగా నిలవాలని సంకల్పించామని చెప్పారు.

First Published:  11 Nov 2023 1:47 AM GMT
Next Story