Telugu Global
Telangana

వరదలతో బురద రాజకీయాలు.. కేంద్రానికి కేటీఆర్ సూటి ప్రశ్నలు..

2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వచ్చిన విపత్తుల నిర్వహణకు ఎన్డీఆర్ఎఫ్ అందించిన సాయం అక్షరాలా పదివేల కోట్ల రూపాయలు. అందులో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. 2019-20 కాలానికి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా వివిధ రాష్ట్రాలకు అందిన సాయం 18,530 కోట్ల రూపాయలు.

వరదలతో బురద రాజకీయాలు.. కేంద్రానికి కేటీఆర్ సూటి ప్రశ్నలు..
X

2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వచ్చిన విపత్తుల నిర్వహణకు ఎన్డీఆర్ఎఫ్ అందించిన సాయం అక్షరాలా పదివేల కోట్ల రూపాయలు. అందులో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. 2019-20 కాలానికి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా వివిధ రాష్ట్రాలకు అందిన సాయం 18,530 కోట్ల రూపాయలు. అందులో కూడా ఒక్క రూపాయి తెలంగాణకు రాలేదు. 2020, 2021, 2022 సంవత్సరంలో ఇప్పటి వరకూ ఎన్డీఆర్ఎఫ్ నుంచి విపత్తుల నిర్వహణకు వివిధ రాష్ట్రాలకు నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. కానీ అందులో తెలంగాణకు మాత్రం పైసా విదల్చలేదు. ఏంటీ వివక్ష..? దీనిపై ఇప్పుడు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.

తెలంగాణకు ఇచ్చిన వరద సాయం సున్నా. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అత్యథిక మొత్తంలో నిధులు విడుదల చేస్తోంది కేంద్రం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే ఇదేనా అని ట్విట్టర్లో ప్రశ్నించారు కేటీఆర్. కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా అని అడిగారు. ఏయే సంవత్సరాల్లో ఏయే రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ ఎంతెంత సాయం చేసిందనే విషయాన్ని గణాంకాలతో సహా వివరించారు కేటీఆర్. దేశం మొత్తానికి ఎంత ఇచ్చారు, తెలంగాణకు ఎందుకు గుండు సున్నా చుట్టూరు అని ప్రశ్నించారు.

తెలంగాణలో ప్రతి ఏడాదీ గోదావరి వరదలకు తీర ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సహజసిద్ధంగా వచ్చే వరదలకు ఎన్ని నష్టనివారణ చర్యలు తీసుకున్నా ఎంతో కొంత ఇబ్బంది కలుగుతూనే ఉంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్ భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తున్నా.. జీహెచ్ఎంసీ ఎన్నికల పేరు చెప్పి, కోడ్ అడ్డంకిగా చూపి సాయాన్ని సైతం అడ్డుకున్నారు బీజేపీ నేతలు. కనీసం కేంద్రం తనవంతుగా కూడా సాయం చేయలేదు. ఈ ఏడాది గోదావరి వరదల సంగతి సరే సరి. వరదలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణపై చిన్నచూపు చూస్తోంది. ఇటీవలే కార్యవర్గ సమావేశాలకు తెలంగాణకు పొలోమంటూ పరిగెత్తారు బీజేపీ నేతలు.

ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో నాయకుడు ఇన్ చార్జిగా ఉన్నారు. ఆయా ఇన్ చార్జులైనా కనీసం ఫోన్లో అయినా స్థానిక నేతల్ని ఆ ప్రాంతం ఎలా ఉందని అడిగారా..? పోనీ కేంద్రమంత్రులెవరైనా ఇటువైపు కన్నెత్తి చూశారా..? నిధులు విడుదల చేయాల్సి వస్తుందేమోనన్న కారణంగా వరద కష్టాలను కాషాయదళం అస్సలు పట్టించుకోలేదు. పైగా కాళేశ్వరంపై జోకులు మాత్రం బాగానే వేశారు. 2020 హైదరాబాద్ వరదలకు, 2022 గోదావరి వరదల సమయంలో చిల్లిగవ్వ ఇవ్వకుండా తెలంగాణపై వివక్ష చూపించారంటూ మండిపడ్డారు కేటీఆర్. పీఎంవో కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో నిలదీశారు.



First Published:  19 July 2022 4:29 PM GMT
Next Story