Telugu Global
Telangana

ఆయన నియోజకవర్గంలో కనపడడు.. కానీ సోషల్ మీడియాలో ఉంటాడు : ఎమ్మెల్సీ కవిత

ఐటీ టవర్ నిర్మాణంతో నిజామాబాద్ జిల్లా దశ మారబోతోంది. ఉద్యోగ కల్పనపై బీజేపీ మాట్లాడేవన్నీ అబద్దాలే అని అన్నారు.

ఆయన నియోజకవర్గంలో కనపడడు.. కానీ సోషల్ మీడియాలో ఉంటాడు : ఎమ్మెల్సీ కవిత
X

నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ జిల్లాకు చేసింది ఏమీ లేదు. ఆయన ఏనాడూ నియోజకవర్గంలో కనపడడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఉంటాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తా.. తప్పకుండా గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. నిజామాబాద్ జిల్లా కూడా ఇందుకు మినహాయింపు కాదు. కొత్తగా ప్రారంభించిన ఐటీ హబ్ గురించి ఎంపీ ధర్మపురి అరవింద్ దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి అవాకులు చెవాకులు పేలడం అరవింద్‌కు అలావాటే అని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, బీజేపీ ఎంపీల అబద్దాలు, ఇతర విషయాలపై ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ బిగాలతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐటీ టవర్ నిర్మాణంతో నిజామాబాద్ జిల్లా దశ మారబోతోంది. ఉద్యోగ కల్పనపై ఎంపీ అరవింద్ మాట్లాడేవన్నీ అబద్దాలే అని అన్నారు. జిల్లాలో వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోంది. మరి జిల్లాకు కేంద్రం చేసింది ఏంటి? జిల్లా అభివృద్ధిలో బీజేపీ, అరవింద్ పాత్రేంటని కవిత ప్రశ్నించారు. జిల్లాకు ఆయన ఏమీ చేయలేదు.. అందుకే కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అరవింద్ పారిపోతున్నాడని కవిత ఎద్దేవా చేశారు. సీఎం గురించి కూడా ధర్మపురి అరవింద్ ఏవేవో మాట్లాడుతున్నారు.. సీఎంను సవాలు చేసేంత స్థాయి ధర్మపురి అరవింద్‌కు లేదని కవిత అన్నారు.

కరెంట్ తీగలు పట్టుకో బండి సంజయ్..

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ వేదికగా తెలంగాణపై విషం చిమ్మారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఎక్కడా రావడం లేదని అన్నారు. కరీంనగర్ బీజేపీ ఆఫీసుకో.. హైదరాబాద్ బీజేపీ ఆఫీసుకో రా.. అక్కడ కరెంట్ తీగలు పట్టుకో.. రోజులో ఎప్పుడైనా పట్టుకో.. కరెంట్ వస్తుందో రాట్లేదో తెలుస్తుందని కవిత అన్నారు. బండి సంజయ్ మా నాయకుడైన సీఎం కేసీఆర్‌ను చాలా పర్సనల్‌గా తిట్టారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. సంజయ్ మాటలను తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. పార్లమెంట్‌లో నిలబడి అబద్దాలు మాట్లాడటం సరికాదని కవిత సూచించారు.

అవకాశం వచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడాలి. ఒక మంచి మాట మాట్లాడు.. మంచి విషయం చెప్పు. అంతే కానీ ఇలాంటి అబద్దాలు, అవాకులు చెవాకులు మాట్లాడటం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జాతీయ హోదా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. కానీ మధ్యప్రదేశ్‌లో ఉన్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి రూ.22వేల కోట్లు మంజూరు చేశారు. నిన్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అయితే.. కాళేశ్వరానికి ఏకంగా రూ.86 వేల కోట్లు ఇచ్చామని అబద్దాలు మాట్లాడారు. దానికి కొనసాగింపుగా ఎంపీ బండి సంజయ్ కూడా అవే అబద్దాలు రిపీట్ చేశారంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేము నిత్యం ప్రజల్లో ఉంటున్నాం : ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

నిజామాబాద్ జిల్లా పదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. అప్పుడు జిల్లా ఎలా ఉండేది.. ఇప్పుడు ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలుసని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి అన్నారు. మమ్మల్ని గెలిపించినందుకు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాము. జిల్లా కేంద్రానికి ఐటీ హబ్ రావడం వల్ల ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరుగుతాయన్నారు. ధర్మపురి అరవింద్ ఒక దౌర్భాగ్యుడు.. ఆయన ఎంపీగా గెలవడంతో నిజామాబాద్ ఇరవై ఏళ్లు వెనక్కి పోయింది. ఇప్పుడు ఆయన తిరిగి గెలిచే పరిస్థితి లేదని బాజిరెడ్డి చెప్పారు. ఎంపీగా ఇంకో నాలుగైదు నెలల పదవీకాలం ఉంది.. దాన్నైనా ఆయన సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో పని చేసే నాయకులను విమర్శించడం మానుకోవాలి. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతా అని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. చివరకు ఆయనే జైలుకు వెళ్లాడు. ఇప్పుడు కేసీఆర్‌కు పిండం పెడతా అని దారుణంగా మాట్లాడుతున్నాడు. రేవంత్‌కే ప్రజలు పిండం పెట్టడం ఖాయమని అన్నారు. మంచిగా మాట్లాడటం చేతకాకపోతే.. ఆ నేతలను ఎవరూ విడిచిపెట్టరని అన్నారు. పైన తథాస్తు దేవతలు ఉంటారు. అన్నీ వాళ్లే చూసుకుంటారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బాజిరెడ్డి అన్నారు.

బీజేపీకి ఉన్నది టెంపరరీ ఓటింగ్ మాత్రమే : గణేష్ బిగాల

తెలంగాణలో బీజేపీకి ఎలాంటి ఓటు బ్యాంకు లేదు. ఇప్పుడు ఉన్నది టెంపరరీ ఓటింగ్ మాత్రమే అని గణేష్ బిగాల అన్నారు. ఎంపీ అరవింద్‌కు కూలగొట్టడం మాత్రమే తెలుసు.. అందుకే మా అభివృద్ధి పనులు పాడుకావాలని ఆయన కోరుకుంటున్నాడని మండిపడ్డారు. అరవింద్‌వి అన్నీ చిల్లర రాజకీయాలు.. ఆయన ఏదో ఫ్లూక్‌గా గెలిచారు. మాకు బీజేపీ ఎప్పటికీ పోటీ కానే కాదని ధీమా వ్యక్తం చేశారు. ధర్మపురి అరవింద్ నోరు, ఒళ్లు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.


First Published:  10 Aug 2023 2:36 PM GMT
Next Story