Telugu Global
Telangana

ముస్లిం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచండి : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లు 12 శాతం వరకు పెంచాలని, వీలు కాకపోతే కనీసం 9 శాతం చేయాలని అందులో పేర్కొన్నది. అంతే కాకుండా ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ ఉన్నట్లే ముస్లింలకు కూడా సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని సూచించింది.

ముస్లిం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచండి : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
X

తెలంగాణలో ముస్లింల కోటాను 12 శాతానికి పెంచాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్‌కు కోరారు. ఇటీవల గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచిన నేపథ్యంలోనే ఓవైసీ కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ముస్లింలు తీవ్రమైన వెనకబాటుకు గురయ్యారని.. సుధీర్ కమిషన్ గతంలోనే రిజర్వేషన్లను 8 నుంచి 12 శాతానికి మధ్య పెంచుకోవచ్చని నివేదిక ఇచ్చిన విషయాన్ని ఓవైసీ గుర్తు చేశారు. ముస్లిం జనాభా, సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న 4 శాతం రిజర్వేషన్ సరిపోవడం లేదని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఓవైసీ అభ్యర్థించారు.

2015 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల పెంపు విషయంలో సుధీర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఎంఏ. బారి, అబ్దుల్ షబాన్, అమిర్ఉల్లా ఖాన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత ఏడాది కమిషన్ 860 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లు 12 శాతం వరకు పెంచాలని, వీలు కాకపోతే కనీసం 9 శాతం చేయాలని అందులో పేర్కొన్నది. అంతే కాకుండా ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ ఉన్నట్లే ముస్లింలకు కూడా సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని సూచించింది. తమిళనాడులో ఇప్పటికే ఇలాంటి రిజర్వేషన్ అమలు అవుతుందని. రాష్ట్ర ప్రభుత్వం అక్కడి విధానాలను పాటిస్తూ రిజర్వేషన్ అమలు చేస్తే సరిపోతుందని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం బీసీ-ఈ గ్రూపు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఈ కమిషన్ ఏర్పాటు చేసింది.

కాగా, 2014 ఎన్నికల సమయంలోనే మైనార్టీలకు, గిరిజనులకు 12 శాతం కోటా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే గతంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. వాల్మీకి బోయ, కాగిత లంబాడాలను కూడా ఎస్టీల్లో చేర్చారు. ఈ ప్రతిపాదనతో పాటే ముస్లిం వర్గాల రిజర్వేషన్ పెంపును కూడా కలిపి కేంద్రానికి పంపారు. కానీ, కేంద్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. రెండు ప్రతిపాదనలు కలిపి పంపడం వల్లే అప్పట్లో తిరస్కరించినట్లు అధికారులు చెప్తున్నారు. తాజాగా మరోసారి విడివిడిగా ప్రతిపాదనలు పంపాలని ఓవైసీ సూచిస్తున్నారు.

First Published:  23 Sep 2022 3:21 PM GMT
Next Story