Telugu Global
Telangana

మోదీ ఫొటో చూపించలేక నా బొమ్మ వేసుకున్నారు..

కార్టూన్‌ లో తనను ఖాజీగా చూపించారని చెప్పుకొచ్చారు. మోదీ ఫొటో చూపించలేక చివరకు బీజేపీ తన ఫొటోని ప్రచారానికి వాడుకుంటోందంటూ ఎద్దేవా చేశారు అసదుద్దీన్.

మోదీ ఫొటో చూపించలేక నా బొమ్మ వేసుకున్నారు..
X

ఎన్నికల ప్రచారం సహజంగా ఆయా నాయకుల ఫొటోలతోనే జరుగుతుంది. కానీ తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ఈ ప్రచారం రివర్స్ లో ఉంది. కాంగ్రెస్ ప్రచార ప్రకటనల్లో కేసీఆర్ ని పోలిన పాత్రని పెట్టారు, కారు టైరులో గాలిపోయినట్టు చిత్రీకరించారు. ఇక బీఆర్ఎస్ రూపొందించిన కొన్ని ప్రకటనల్లో హస్తం గుర్తుపై సెటైర్ పేలింది. చైన్ స్నాచర్ల వీడియోలు పెట్టి ఆ చెయ్యి ఇదేనంటూ కౌంటర్లిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ కూడా ఇలాంటి ప్రయోగం చేసింది. అయితే ఆ ప్రకటనలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ క్యారికేచర్ ఉంటుంది. ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ కి పెళ్లి జరిపిస్తున్నట్టుగా పోస్టర్లు రూపొందించింది బీజేపీ.

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ఈ పోస్టర్‌లో పెళ్లి పెద్ద(ఖాజీ)గా అభివర్ణించింది. దీంతో ఈ పోస్టర్‌ పై అసదుద్దీన్ స్పందించారు. ఈ వయసులో తన ఫొటోని పెళ్లి కార్డులో వేశారని, ఇంతకీ తాను పెళ్లి కొడుకునా..? అని ప్రశ్నించారు. కార్టూన్‌ లో తనను ఖాజీగా చూపించారని చెప్పుకొచ్చారు. మోదీ ఫొటో చూపించలేక చివరకు బీజేపీ తన ఫొటోని ప్రచారానికి వాడుకుంటోందంటూ ఎద్దేవా చేశారు అసదుద్దీన్.

మోదీకి అంత సీన్ లేదా..?

ఎన్నికల ప్రచారం ఆ పార్టీలోని పెద్ద నేతల ఫొటోలతో జరిగే బాగుంటుందని, కానీ బీజేపీ మాత్రం ఓట్లు అడగడానికి తన ఫొటోని ప్రజల ముందుకు తెచ్చిందని కౌంటర్ ఇచ్చారు అసదుద్దీన్. అంటే వారికి ప్రధాని మోదీ ఫొటో పనికి రాదని అర్థమైందన్నారు. మోదీకంటే అసదుద్దీన్ ఫొటో పెడితేనే లాభం ఉంటుందని వారు అనుకుంటున్నారని.. "అలేగా కానివ్వండి" అంటూ సెటైర్ పేల్చారు. తెలంగాణ ఎన్నికల్లో మోదీ ప్రభావం కనపడదని చెప్పారు అసదుద్దీన్.

First Published:  12 Nov 2023 9:50 AM GMT
Next Story