Telugu Global
Telangana

డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి నర్సింహులు భేటీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బెంగళూరు నుంచే కంట్రోల్ చేస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను మోత్కుపల్లి తాజాగా కలిశారు.

డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి నర్సింహులు భేటీ
X

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ జీవితం ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉన్నది. టీడీపీలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన మోత్కుపల్లి కెరీర్.. చంద్రబాబు దగ్గర నుంచే మసకబారుతూ వచ్చింది. బీఆర్ఎస్‌లో చేరినా ఆయనకు పెద్దగా అవకాశాలు ఏవీ రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు గవర్నర్‌ల నియామకం చేపట్టినా.. మోత్కుపల్లికి వస్తుందేమో అనే వార్త గతంలో హల్‌ చల్ చేసేది. ప్రస్తుతం రాజకీయ పరంగా చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న మోత్కుపల్లి.. కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బెంగళూరు నుంచే కంట్రోల్ చేస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను మోత్కుపల్లి తాజాగా కలిశారు. బెంగళూరులోని శివకుమార్ ఇంటికి వెళ్లిన మోత్కుపల్లి చాలా సేపు రాజకీయాలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి.. తనకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చిందని తెలిపారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటానని అన్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత అక్కడ అన్ని విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నుంచి మోత్కుపల్లి తొలుత ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. 2009లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన మోత్కుపల్లి కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టి తొలుత బీజేపీలో చేరారు. అక్కడ కొన్నాళ్లు ఉన్న తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. అయితే తాను ఆశించిన ఏ పదవీ దక్కకపోవడంతో కొన్నాళ్లుగా బీఆర్ఎస్‌తో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

మోత్కుపల్లి కాంగ్రెస్‌లోకి వచ్చినా టికెట్ కేటాయించే పరిస్థితి లేదని పార్టీలో నాయకులు అంటున్నారు. మోత్కుపల్లి కోరుకునే తుంగతుర్తి, ఆలేరు ఇప్పటికే బలమైన నాయకులతో నిండిపోయిందని.. ఆ రెండు చోట్ల భారీగా పోటీ ఉన్నదని చెబుతున్నారు. అయితే తుంగతుర్తి నుంచి గత రెండు పర్యాయాలు ఓడిపోయిన అద్దంకి దయాకర్ బదులు తనకు టికెట్ ఇస్తే గెలుస్తానని మోత్కుపల్లి చెప్పినట్లు సమాచారం. అయితే రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన దయాకర్‌ను కాదని మోత్కుపల్లికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది కొంత కాలం ఆగితే కానీ స్పష్టం కాదు.


First Published:  29 Sep 2023 10:11 AM GMT
Next Story