Telugu Global
Telangana

కాంగ్రెస్‌ టికెట్‌ కోసం వెయ్యికి పైగా దరఖాస్తులు..

నాగార్జున సాగర్‌ టికెట్‌ కోసం జానారెడ్డి ఇద్దరు కుమారులు జైవీర్‌ రెడ్డి, రఘువీర్‌ రెడ్డి దరఖాస్తు చేసుకోగా.. కరీంనగర్‌ నుంచి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేష్‌ రావు అప్లికేషన్ పెట్టుకున్నారు.

కాంగ్రెస్‌ టికెట్‌ కోసం వెయ్యికి పైగా దరఖాస్తులు..
X

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మొత్తం ఎనిమిది రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియలో దాదాపు వెయ్యి మందికిపైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యధికంగా ఇల్లందు నియోజకవర్గానికి 38 దరఖాస్తులు వచ్చాయి.

మధిర అసెంబ్లీ స్థానానికి భట్టి విక్రమార్క, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి తరఫున ఆయన భార్య దరఖాస్తు చేశారు. నాగార్జున సాగర్‌ టికెట్‌ కోసం జానారెడ్డి ఇద్దరు కుమారులు జైవీర్‌ రెడ్డి, రఘువీర్‌ రెడ్డి దరఖాస్తు చేసుకోగా.. కరీంనగర్‌ నుంచి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేష్‌ రావు అప్లికేషన్ పెట్టుకున్నారు. ముషీరాబాద్‌ నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్, ఆయన కొడుకు అనిల్‌. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానానికి సర్వే సత్యనారాయణ.. ఎల్బీ నగర్‌ నుంచి మధుయాష్కీ, హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌, కోదాడ నుంచి పద్మావతి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక సీనియర్ లీడర్లు జానారెడ్డి, రేణుకా చౌదరి, గీతారెడ్డి, వీహెచ్‌ ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదు. నాగర్‌ కర్నూలు నుంచి తప్పకుండా పోటీలో ఉంటానని ప్రకటించిన నాగం జనార్ధన్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ స్థానం నుంచి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు బరిలో ఉంటారని తెలుస్తోంది.

ఇక ఇటీవల బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మూడు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు స్థానాలకు పొంగులేటి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నల్గొండ, షబ్బీర్ అలీ కామారెడ్డి, పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌, కొండా సురేఖ వరంగల్‌ తూర్పు స్థానాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. శనివారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానుంది.

*

First Published:  25 Aug 2023 4:30 PM GMT
Next Story