Telugu Global
Telangana

తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు.. యూఎస్ సంస్థలతో కీలక ఒప్పందాలు

తెలంగాణలో ఇప్పటికే రూ.200 కోట్లతో సిద్ధిపేటలో మార్స్ పెట్ కేర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని.. ఇక ఫెజ్-2లో భాగంగా రూ.800 కోట్లతో భారీగా విస్తరిస్తామని వారు పేర్కొన్నారు.

తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు.. యూఎస్ సంస్థలతో కీలక ఒప్పందాలు
X

యూఎస్ పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పలు సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మరి కొన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పెట్ ఫుడ్ ఉత్పత్తుల్లో సుప్రసిద్ధమైన మార్స్ గ్రూప్‌ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ బృందం భేటీ అయ్యింది.

తెలంగాణలో సంస్థ విస్తరణ ప్రణాళికలను, కొత్త పెట్టుబడులను మార్స్ గ్రూప్ చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే సిద్దిపేట కేంద్రంగా కొనసాగుతున్న తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. దేశంలో తమ ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వస్తోందని వారు తెలిపారు. పెట్ కేర్, పెట్ ఫుడ్స్‌కు డిమాండ్ మరింతగా పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో తెలంగాణ కేంద్రంగా మరింతగా విస్తరిస్తామని వెల్లడించారు.

తెలంగాణలో ఇప్పటికే రూ.200 కోట్లతో సిద్ధిపేటలో మార్స్ పెట్ కేర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని.. ఇక ఫేజ్-2లో భాగంగా రూ.800 కోట్లతో భారీగా విస్తరిస్తామని వారు పేర్కొన్నారు. దీని వల్ల స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ మేరకు మార్స్ గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

టైసన్ ఫుడ్స్‌తో ఒప్పందం..

అమెరికాలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీల్లో ఒకటైన టైసన్ ఫుడ్స్ తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమైంది. 1935లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం ఇండియాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇండియా మార్కెట్‌లో ఉన్న అపార అవకాశాలను దృష్టిలో పెట్టుకొని.. తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది.

ఈ మేరకు టైసన్ ఫుడ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాన్ టర్టన్ నేతృత్వంలోని బృందం న్యూయార్క్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్‌తో పాటు ప్రొడక్ట్ ఇన్నోవేషన్‌కు సంబంధించిన ఆర్ అండ్ డీ, కోల్డ్ చైన్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.

*

First Published:  26 Aug 2023 12:21 AM GMT
Next Story