Telugu Global
Telangana

ఖర్చుకి భయపడి మోదీ సభకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే

కారణం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో మొదలవడంతో చివరకు ఆయనే వివరణ ఇచ్చుకున్నారు. మోదీ సభకు తాను ఎందుకు రాలేదో చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్.

ఖర్చుకి భయపడి మోదీ సభకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే
X

ప్రధాని మోదీ బీసీ గర్జన సభ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. పవన్ కల్యాణ్ సహా ఈ సభకు చాలామంది కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ బీజేపీ తాజా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వచ్చారు. కానీ సభ జరిగిన గోషా మహల్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. కారణం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో మొదలవడంతో చివరకు ఆయనే వివరణ ఇచ్చుకున్నారు. మోదీ సభకు తాను ఎందుకు రాలేదో చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్.

బీసీ గర్జన సభ జరిగిన ఎల్బీ స్టేడియం గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి.. గోషా మహల్ లో జరిగే బీసీ సభకు ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయితే ఆ ఖర్చంతా ఆయన ఖాతాలోనే వేస్తారు. ఎన్నికల సంఘం అదికారులు కూడా ఇదే విషయం స్పష్టం చేయడంతో రాజాసింగ్ అయిష్టంగానే ఆ సభకు దూరంగా ఉండిపోయారు. ఎన్నికల్లో పరిమితికి మించి డబ్బు ఖర్చుపెట్టకూడదు. లెక్కల్లో తేడా వస్తే అనర్హత వేటుపడే అవకాశముంది. అందుకే రాజాసింగ్ ముందు జాగ్రత్తగా ఆ మీటింగ్ కి డుమ్మా కొట్టారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే గైర్హాజరంటూ వార్తలు రావడంతో వెంటనే రాజాసింగ్ స్పందించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభను కార్యకర్తలతో కలిసి టీవీలో చూశానని చెప్పారాయన. తన నియోజకవర్గంలో జరిగిన సభను అలా టీవీలో చూడటం తనకెంతో బాధగా ఉందని అన్నారు. ఆ సభలో పాల్గొంటే ఖర్చు మొత్తం తన ఖాతాలో రాసే అవకాశం ఉంది కాబట్టి తాను హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నారు. తన గురువు మోదీ పాల్గొన్న సభలో పాల్గొనలేకపోవడం బాధగా ఉందన్నారు రాజాసింగ్.

First Published:  7 Nov 2023 4:29 PM GMT
Next Story