Telugu Global
Telangana

మోడీ ప్రభుత్వ చర్యలు.. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయి : సీఎం కేసీఆర్

దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఆగడాలు మితిమీరి పోతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.

మోడీ ప్రభుత్వ చర్యలు.. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయి : సీఎం కేసీఆర్
X

ఆనాడు ఇందిరా గాంధీ అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు. ఆ తర్వాతే దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, మోడీ ప్రభుత్వం కూడా ఆనాటి రోజులను తలపింప చేస్తోందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకం, ట్రాన్స్‌ఫర్లు ఎన్నుకోబడిన ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ, ఆ తీర్పును కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావాలని నిర్ణయించింది.

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఈ ఆర్డినెన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకొని రాకుండా చేయాలని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు కోసం శనివారం పంజాబ్ సీఎం భగవంత్‌ సింగ్‌తో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో ఇద్దరు సీఎంలతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేజ్రివాల్ నేతృత్వంలో మూడు సార్లు ఆప్ విజయం సాధించింది. మూడు సార్లు వరుసగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని రావడం దుర్మార్గమని అన్నారు.

దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఆగడాలు మితిమీరి పోతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెడుతూ.. పని చేయనీయడం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కేంద్ర ప్రభుత్వం నానా రకాలుగా బెదిరింపులకు, అనేక దుర్మార్గాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

ఢిల్లీలో కేజ్రివాల్ నాయకత్వంలో ఆప్ మూడు సార్లు విజయం సాధించింది. ఢిల్లీలో పాపులర్ గవర్నమెంట్ ఉన్నది. అక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యుత్, విద్య, వైద్యం వంటి రంగాల్లో మంచి ప్రగతిని కనపరుస్తున్నారు. నేను కూడా వెళ్లి ఒకసారి పరిశీలించాను. అలాంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోందని కేసీఆర్ అన్నారు. ఇటీవల ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే.. ఆప్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేంద్రం అనేక ఇబ్బందులకు గురి చేసింది. చివరకు సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ప్రమాణం చేయాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తీసుకొని వచ్చి అక్కడి ప్రభుత్వాన్ని ఊపిరాడనీయకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులందరూ పని చేయాల్సి ఉంటుందని అత్యున్నత కోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చింది. గవర్నర్ల చేతిలో పాలన ఉండరాదని కూడా స్పష్టం చేసింది. కానీ ఇవాళ ఆ తీర్పును కాలరాసి.. భయంకరమైన ఆర్డినెన్స్‌ను తీసుకొని వచ్చారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఎమర్జెన్సీ రోజులను మోడీ ప్రభుత్వం గుర్తుకు తెస్తోందని చెప్పారు. పార్లమెంటులో ఈ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. ఈ ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేకపోతే ఉభయసభల్లో అడ్డుకుంటామని కేంద్ర ప్రభుత్వన్ని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

ఆర్టినెన్స్‌ను అందరూ తిరస్కరించాలి..

ఢిల్లీలో తొలి సారి 2015లో అధికారంలోకి వచ్చాము. కానీ మూడు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలన్నింటినీ లాగేసుకొని.. లెఫ్టినెంట్ గవర్నర్లకు కట్టబెడుతూ మోడీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తే ఈ మే నెలలో సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆ నోటిఫికేషన్ చెల్లదని తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పును కాలరాస్తూ కేంద్రం వారంలోనే ఆర్టినెన్స్ తీసుకొని వచ్చిందని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ల చేతిలో పాలనను పెట్టే ఆర్డినెన్స్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టినప్పుడు విపక్ష పార్టీలన్నీ ఏకం కావల్సిన అవసరం ఉందని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ చెప్పారు. బీజేపీయేతర పార్టీలన్నీ కలిసినప్పుడు తప్పకుండా ఆ ఆర్డినెన్స్ పాస్ కాదని అన్నారు. అదే కనుక జరిగితే.. బీజేపీ 2024 ఎన్నికల్లో ఓడిపోతుందని కేజ్రివాల్ అన్నారు. ఆర్డినెన్స్ పాస్ కాకుండా చేస్తే.. దేశ ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని పంపినట్లు అవుతుందని కేజ్రివాల్ చెప్పారు. సీఎం కేసీఆర్ మాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

అంతకు ముందు ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌లకు సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. వారిని శాలువాలతో సత్కరించి ప్రగతిభవన్‌లోనికి తోడ్కొని వెళ్లారు. ఇద్దరు సీఎంలకు అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై ముగ్గురు సీఎంలు చర్చించారు. దాని వల్ల రాబోయే రోజుల్లో జరిగే అనర్థాలపై కూడా చర్చించారు. రాష్ట్రాలపై పూర్తి అధికారాలను చేజిక్కించుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్స్‌లు తీసుకొని వస్తోందని వారు అభిప్రాయపడ్డారు.


First Published:  27 May 2023 10:31 AM GMT
Next Story