Telugu Global
Telangana

ప్రభుత్వ రంగంలో మోడీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు తీసేసింది.. ఇదేనా అమృత్ కాల్ : రాహుల్ గాంధీ

రాహుల్ పేర్కొన్నట్లు 2 లక్షలు కాక.. మోడీ పాలనలో దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగాలు దేశ యువతకు అందుబాటులో లేకుండా పోయాయి

ప్రభుత్వ రంగంలో మోడీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు తీసేసింది.. ఇదేనా అమృత్ కాల్ : రాహుల్ గాంధీ
X

కేంద్రంలో బీజేపీ, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు లభించాల్సిన 2 లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు మాయం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) మన దేశానికి ఎంతో గర్వ కారణం. ఎంతో మంది యువకులకు ఆ ఉద్యోగం సంపాదించడం ఒక కలగా ఉండేది. కానీ ఇప్పటి ప్రభుత్వానికి ఈ విషయంలో ఎలాంటి ప్రాధాన్యత లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు

దేశంలోని పీఎస్‌యూలలో 2014 నాటికి 16.9 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ 2022 నాటికి ఉద్యోగాలు 14.6 లక్షలకు తగ్గాయి. భారత్ లాంటి ప్రగతి శీల దేశంలో ఎక్కడైనా ఉద్యోగాలు తగ్గుతాయా అని ఆయన ప్రశ్నించారు. బీఎస్ఎన్ఎల్‌లో 1,81,127 ఉద్యోగాలు కోల్పోయాము. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 61,928, ఎంటీఎన్ఎల్‌లో 34,997, ఎస్ఈసీఎల్‌లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్‌జీసీలో 21,120 ఉద్యోగాలను మనం కోల్పోయామని ఆయన పేర్కొన్నారు.

ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన వాళ్లు.. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు తొలగించారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగానికి చెందిన పై సంస్థల్లో కాంట్రాక్టు పద్దతిలో రిక్రూట్‌మెంట్లను దాదాపు రెట్టింపు చేసింది. కాంట్రాక్టు ఉద్యోగాలను పెంచడం అంటే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కును హరించి వేయడం కాదా.. ఇది చివరకు ఆయా కంపెనీలను ప్రైవేటీకరించే కుట్రగా రాహుల్ గాంధీ అభివర్ణించారు.

పారిశ్రామికవేత్తలకు భారీగా రుణాలు మాఫీ చేయబడ్డాయి. అదే సమయంలో పీఎస్‌యూల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తీసివేయబడ్డాయి. ఇది ఎలాంటి చర్య అని రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ పాలన నిజంగా 'అమృత్ కాల్' అయితే ఉద్యోగాలు ఎందుకు ఇలా కనుమరుగు అవుతున్నాయని ప్రశ్నించారు. కొద్ది మంది క్యాపిటలిస్ట్ మిత్రుల ప్రయోజనాల కోసం లక్షలాది మంది యువత ఆశలు అడియాశలు అవుతున్నాయి. అందుకే మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో రికార్డు స్థాయిలో యువత నిరుద్యోగంతో సతమత మవుతోందని దుయ్యబట్టారు.

దేశంలోని పీఎస్‌యూలకు సరైన వాతావరణ, ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తే అవి తప్పకుండా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటాయి. అంతే కాకుండా ఉపాధిని కూడా పెంచగలవని రాహుల్ సూచించారు. పీఎస్‌యూలు మన దేశ పౌరుల ఆస్తి. వాటిని ప్రోత్సహించి.. దేశ పురోగతి పథాన్ని బలోపేతం చేయాలని రాహుల్ గాంధీ కోరారు.

రాహుల్ ఉటంకించినట్లు పై సంస్థలే కాకుండా దేశంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కనుమరుగు అవుతున్నాయి. ఇండియన్ ఆయిల్‌లో 79,828, మహానది కోల్‌ఫీల్డ్స్‌లో 36,418, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 22,235, నార్తరన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 17,674, హెచ్‌పీసీఎల్‌లో 16,422 ఉద్యోగాలు రద్దు చేయబడ్డాయి. అంటే రాహుల్ పేర్కొన్నట్లు 2 లక్షలు కాక.. మోడీ పాలనలో దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగాలు దేశ యువతకు అందుబాటులో లేకుండా పోయాయి.

First Published:  19 Jun 2023 11:20 AM GMT
Next Story