Telugu Global
Telangana

నేను తెలంగాణ యాసలో మాట్లాడాను.. అది తప్పేం కాదు : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివరణ

తెలంగాణ యాసలో మాట్లాడానని.. తాను వాడిన ఒక పదాన్ని పట్టుకొని అంతా రచ్చ చేస్తున్నారని.. అసలు మొత్తం విషయం వింటే తాను కావాలని అన్నానా లేదా అనే విషయం అర్థం అవుతుందని కౌశిక్ రెడ్డి కమిషన్‌కు తెలియజేసినట్లు సమాచారం.

నేను తెలంగాణ యాసలో మాట్లాడాను.. అది తప్పేం కాదు : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివరణ
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు రావడంతో మంగళవారం ఆయన ఢిల్లీ వెళ్లారు. జాతీయ మహిళా కమిషన్ ముందు తన వివరణను ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని కౌశిక్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ యాసలో మాట్లాడానని.. తాను వాడిన ఒక పదాన్ని పట్టుకొని అంతా రచ్చ చేస్తున్నారని.. అసలు మొత్తం విషయం వింటే తాను కావాలని అన్నానా లేదా అనే విషయం అర్థం అవుతుందని కౌశిక్ రెడ్డి కమిషన్‌కు తెలియజేసినట్లు సమాచారం. తాను తప్పేం మాట్లాడలేదని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒక వేళ తాను అన్నది తప్పని అనుకుంటే ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోల ఆధారంగా వారిపై ఫిర్యాదు చేస్తానని కూడా కౌశిక్ చెప్పారు.

కాగా, జనవరి 26న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ హుజూరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో గవర్నర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తొక్కి పెట్టారనే విషయాన్ని మాట్లాడుతూ ఒక అభ్యంతరకరమైన పదాన్ని వాడారు. గవర్నర్ కారణంగా ఒక్క బిల్లు కూడా పాస్ కావడం లేదని ఆరోపించారు.

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ కార్పొరేటర్ కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత నెల 28న బీసీ పొలిటికల్ జేఏసీ ఇదే విషయంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఆయనను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగ పదవిని కౌశిక్ అగౌరవ పరిచాడని పేర్కొన్నది. కాగా, కౌశిక్ రెడ్డి మాత్రం తాను తప్పుగా మాట్లాడలేదని.. తెలంగాణ యాసలో మాట్లాడినందుకే దాన్నిచాలా మంది తప్పుబడుతున్నారని వివరణ ఇచ్చారు.మరి దీనిపై మహిళా కమిషన్ ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  21 Feb 2023 10:42 AM GMT
Next Story