Telugu Global
Telangana

రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక

ఒకవేళ అలా బెదిరించాలనుకుంటే.. కాంగ్రెస్ పేరుని తెలంగాణ ప్రజలు రెడ్ డైరీలో రాసుకుంటారని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మనుగడ ఉండదని అన్నారు కవిత.

రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక
X

రెడ్ డైరీలో పేర్లు రాసుకుంటున్నామంటూ పోలీసుల్ని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని, ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడబోరని, పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఒకవేళ అలా బెదిరించాలనుకుంటే.. కాంగ్రెస్ పేరుని తెలంగాణ ప్రజలు రెడ్ డైరీలో రాసుకుంటారని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మనుగడ ఉండదని అన్నారు కవిత.


ఇది బీఆర్‌ఎస్‌ అభివృద్ధి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు కవిత. బోధన్‌ లో బీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్‌, కార్యకర్తలపై కాంగ్రెస్‌ దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. రౌడీయిజం, గూండాయిజాన్ని ప్రోత్సహించేవాళ్లకు పట్టం కట్టొద్దని ప్రజలకు సూచించారు కవిత. ఎవరి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్లాటలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని, ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఏం తప్పు చేసిందని నిలదీశారు. తాము అభివృద్ధి వైపు వెళ్తుంటే కాంగ్రెస్ వాళ్లు అరాచకం వైపు వెళ్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని, దాన్ని జీర్ణం చేసుకోలేక పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలపై భౌతిక దాడికి దిగడం హేయమైన చర్య అని అన్నారు కవిత.

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా ? అన్నది తల్లిదండ్రులు ఆలోచించాలని, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే పనిచేద్దామా, ప్రైవేటు పెట్టుబడులు మనకు వద్దా అన్నది ఆలోచించాలని కోరారు కవిత. తెలంగాణలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చామని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 24 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, అందులో తెలంగాణ ప్రాంతానికి కేవలం 10 వేల ఉద్యోగాలు వచ్చాయని, అంటే ఏటా వెయ్యి ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చిందని వివరించారు కవిత. అధికారంలోకి రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కర్నాటకలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.

అస్థిరత అంటేనే కాంగ్రెస్..

కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా రెండు మూడు నెలలకే ప్రభుత్వం అస్థిరమవుతుందని స్పష్టం చేశారు కవిత. కర్నాటకలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మధ్యలోకి.. కొత్తగా సతీష్ అనే ఎమ్మెల్యే వచ్చారని అన్నారు. రాజస్థాన్‌ లో అశోక్ గెహ్లాట్‌, సచిన్ పైలట్ ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉంటారని, మధ్యప్రదేశ్‌ లో ప్రజలు అధికారం ఇస్తే కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కొట్లాడుకొని ఏడాదిలోనే ప్రభుత్వాన్ని కూల్చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు పూటకో ముఖ్యమంత్రి కావాలా అని ప్రజల్ని ప్రశ్నించారు కవిత.

First Published:  22 Nov 2023 3:23 PM GMT
Next Story