Telugu Global
Telangana

హీరోయిన్ రష్మికకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్

రష్మికను టార్గెట్ చేస్తూ వచ్చిన డీప్‌ ఫేక్‌ వీడియోపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ బెదిరింపుల నుంచి భారతీయ మహిళలను రక్షించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

హీరోయిన్ రష్మికకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్
X

ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది. బ్రిటిష్ ఇండియన్ మోడల్ జరా పటేల్ వీడియోని రష్మిక ఫొటోతో మార్ఫింగ్ చేశారు. ఆమె లిఫ్ట్ లో ఎక్కుతున్నప్పుడు తీసిన వీడియో అది. ఆ వీడియో ఇబ్బందికరంగా ఉండటంతో రష్మిక టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అందరూ అది నిజమైన వీడియోనే అనుకున్నారు. కానీ అసలు వీడియో బయటపడిన తర్వాతకానీ అసలు సంగతి తెలియలేదు. దీనిపై రెండురోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా రష్మికకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.


ఆన్‌ లైన్‌ లో ఫేక్ వీడియోలు సులభంగా వ్యాప్తి చెందుతున్నాయని, ఆన్ లైన్ లో ఉన్న మ్యానిప్యులేషన్స్‌ కు ఇదొక తీవ్ర హెచ్చరిక లాంటిదని అన్నారు కవిత. రష్మికను టార్గెట్ చేస్తూ వచ్చిన డీప్‌ ఫేక్‌ వీడియోపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ బెదిరింపుల నుంచి భారతీయ మహిళలను రక్షించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర చర్యలు తీసుకోవాలంటూ కవిత ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి భవన్, ప్రధాని మోదీ, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశారు.


తీవ్ర దుమారం..

రష్మిక డీప్ ఫేక్ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. స్వయంగా రష్మిక కూడా ఈ వీడియోపై స్పందించారు. టెక్నాలజీ దుర్వినియోగం అవుతోందని, తనలాంటి మహిళలను అది బాధపెడుతోందని అన్నారు రష్మిక. ఇదే వీడియో తన స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో బయటకు వచ్చిఉంటే ఎలా ఉండేదో ఊహించుకోడానికే భయంగా ఉందన్నారు. ఈ సందర్భంలో మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అటు కేంద్రం కూడా ఈ వీడియోపై స్పందించింది. కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ట్విట్టర్లో సీరియస్‌ గా స్పందించారు. తప్పుడు సమాచారానికి సంబంధించి ప్రస్తుతం డీప్‌ ఫేక్స్‌ అత్యంత ప్రమాదకరమైనవిగా, హానికరమైనవిగానూ పరిణమిస్తున్నాయని అన్నారాయన. ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీ చట్టంలోని పలు నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాంలకు కూడా కొన్ని సూచనలు చేశారు.



First Published:  7 Nov 2023 3:47 AM GMT
Next Story