Telugu Global
Telangana

ఈనెల 23వరకు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

ఈనెల 23 వరకు కవితను విచారించడానికి వీలుగా ఈడీకి అనుమతి ఇచ్చింది. 23వతేదీన కవితను తిరిగి కోర్టులో హాజరు పరచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈనెల 23వరకు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత
X

ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈనెల 23 వరకు కవితను విచారించడానికి వీలుగా ఈడీకి అనుమతి ఇచ్చింది. 23వతేదీన కవితను తిరిగి కోర్టులో హాజరు పరచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ప్రతి రోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కవితకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది కోర్టు.

నిన్న(శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు అదే రోజు రాత్రి ఢిల్లీకి తరలించారు. ఈడీ కార్యాలయంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈరోజు ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

అంతకు ముందు రౌస్ అవెన్యూ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ ఈడీ ఉల్లంఘించిందని వాదించారు ఎమ్మెల్సీ కవిత తరపు లాయర్‌ విక్రమ్‌ చౌదరి. ఆ హామీని ఉల్లంఘించి ఆమెను అరెస్టు చేశారని తెలిపారు. ఈడీ తరపున న్యాయవాది జోయబ్‌ హుసేన్‌ కోర్టులో వాదనలు వినిపించారు. కవితపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. మీడియాలో వచ్చిన విషయాలను పరిగణలోకి తీసుకోవద్దన్నారు. సెప్టెంబర్‌ 15న తాము సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చినమాట వాస్తవమే అని, అయితే రాబోయే 10 రోజుల్లో సమన్లు ఇవ్వబోమని మాత్రమే తాము చెప్పామని అన్నారు. ఒక్క ఆర్డర్‌ అనుకూలంగా ఉంటే.. దానిని నిరవధిక కాలానికి అన్వయించుకోవద్దన్నారు లాయర్ జోయబ్ హుసేన్. ఇరు వర్గాల వాదనను విన్న అనంతరం కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

First Published:  16 March 2024 12:28 PM GMT
Next Story