Telugu Global
Telangana

మీ ఆవేదన బూటకం, మీ ఆందోళన నాటకం

శవాల మీద పేలాలు ఏరుకోవడం మీకు, మీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని రేవంత్ పై ధ్వజమెత్తారు కవిత. హత్య చేసిన వాళ్లే బాధితులను ఓదార్చుతున్నట్లుగా రేవంత్ రెడ్డి ట్వీట్ ఉందని అన్నారు కవిత.

మీ ఆవేదన బూటకం, మీ ఆందోళన నాటకం
X

తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. ప్రవళికది ఆత్మహత్య కాదు, హత్య అంటూ.. రాహుల్ గాంధీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ఈ ఘటనపై నివేదిక కోరారు. 48గంటల్లో తనకు నివేదిక సమర్పించాలంటూ సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్‌ ఆదేశించారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి వేసిన ట్వీట్ మాత్రం మరింత వైరల్ గా మారింది. బతుకమ్మ సంబురాల గురించి వీడియోలు పెట్టే కవితకు, ప్రవళిక ఆత్మఘోష వినపడ్డం లేదా అని ట్విట్టర్లో ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈ ట్వీట్ కి అంతే ఘాటుగా బదులిచ్చారు కవిత. ప్రవళిక ఆత్మహత్యను కూడా రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. 'మీ ఆవేదన బూటకం, మీ ఆందోళన నాటకం".. అంటూ రేవంత్ కి బదులిచ్చారు.


బతుకమ్మ చేస్తాం, బాధనూ పంచుకుంటాం..

తాము బతుకమ్మను చేయడమే కాదు, బాధను కూడా పంచుకుంటామంటూ ట్వీట్ వేశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడమే మీ విధానమా? అని ప్రశ్నించారు కవిత. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం అన్నారు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పారు.

తప్పు మీదే..

నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిలా మొసలి కన్నీరు కార్చడమేంటని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కాకుండా అడ్డుకోడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా..? అని అన్నారు. కాంగ్రెస్ కుట్రలను బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని వివరించారు. గ్రూప్ 2 ని వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని ఆమె తన ట్వీట్ లో జతచేశారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా గ్రూప్-2 వాయిదా కోరారని గుర్తు చేశారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం మీకు, మీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని రేవంత్ పై ధ్వజమెత్తారు కవిత. హత్య చేసిన వాళ్లే బాధితులను ఓదార్చుతున్నట్లుగా రేవంత్ రెడ్డి ట్వీట్ ఉందని అన్నారు కవిత.


First Published:  14 Oct 2023 9:03 AM GMT
Next Story