Telugu Global
Telangana

ఆక్స్ ఫర్డ్ లో ఆకట్టుకునేలా ప్రసంగం.. ఇంతకీ కవిత ఏం మాట్లాడారంటే..?

తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు మాత్రమే కాదని.. మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత పాటిస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని వివరించారు.

ఆక్స్ ఫర్డ్ లో ఆకట్టుకునేలా ప్రసంగం.. ఇంతకీ కవిత ఏం మాట్లాడారంటే..?
X

బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ‘ఎక్స్‌ప్లోరింగ్‌ ఇన్‌ క్లూసివ్‌ డెవలప్‌ మెంట్‌-ది తెలంగాణ మోడల్‌’ అనే అంశంపై ఎమ్మెల్సీ కవిత కీలక ఉపన్యాసం ఇచ్చారు. భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. అభినవ చాణక్య సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు కవిత.

వనరుల సద్వినియోగం..

ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని అన్నారు కవిత. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు మాత్రమే కాదని.. మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత పాటిస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని వివరించారు. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని చెప్పారు కవిత. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మతకల్లోలాలు జరగలేదని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రశాంతమైన సామాజిక వాతావరణం కూడా ముఖ్యమని వివరించారు.


ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి దారితీసిన పరిస్థితులు, తెలంగాణ సాధనకోసం జరిగిన సుదీర్ఘ పోరాటాన్ని కూడా వివరించారు కవిత. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న పరిస్థితులు, జీవన విధానం, కష్టాలు, నష్టాలు, విద్యుత్ కొరత, సాగునీటి కష్టాలు.. అన్నిటినీ వివరించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పులొచ్చాయో చెప్పారు. విద్యుత్‌ మిగులు సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానానికి చేరిందని తెలిపారు.

గణాంకాల్లో తెలంగాణ అభివృద్ధి..

- 2014-15 నుంచి 2022-23 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 118.2 శాతం పెరగగా.. తెలంగాణ జీఎస్డీపీ 155.7 శాతం పెరిగింది. అంటే జాతీయ సగటు కంటే ఎక్కువ.

- తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.1,12,162 గా ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ.3,14,732కి పెరిగింది.

- 2019-21 లెక్కల ప్రకారం సమాన ఆదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్-1 స్థానంలో ఉంది.

- 2014లో నెగెటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022-23 నాటికి 15.7 శాతం వృద్ధి సాధించింది.

- 2014లో రూ. 62వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ. 2.94 లక్షల కోట్లకు చేరింది.

- 2014లో ఐటీ ఎగుమతుల విలువ రూ.57 వేల కోట్లు కాగా.. ఇప్పుడు ఐటీ ఎగుమతుల విలువ రూ.1.83 లక్షల కోట్లు.

రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అన్నదాతల కోసం తీసుకున్న సంచలన నిర్ణయాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయని అన్నారు కవిత. రైతుబంధు పంపిణీ, పంట కొనుగోలు, ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డుల కంప్యూటరీకరణ, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, 24గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతు.. తదితర కార్యక్రమాలతో రైతాంగం సంతోషంగా ఉందని, తద్వారా తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని వివరించారు కవిత. కాళేశ్వరం ఘనత కేసీఆర్ కి దక్కుతుందని చెప్పారు.

పారిశ్రామిక రంగంలో కూడా తెలంగాణ ఊహించని అభివృద్ధిని సాధించిందని వివరించారు కవిత. టీఎస్ ఐపాస్ ద్వారా 15రోజుల్లోనే అనుమతులు వస్తున్నాయని చెప్పారు. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయన్నారు. వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు. ప్రతి జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని స్పష్టం చేశారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో తెలంగాణ అభివృద్ధి మోడల్ ను వివరించారు కవిత.

First Published:  31 Oct 2023 5:05 AM GMT
Next Story